IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. పేలవ ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. పరాజయాల పరంపరం కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. 153 పరుగుల టార్గెట్ ను గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 43 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు, రూథర్ ఫర్డ్ 35 పరుగులు చేశారు.
Also Read : ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఎంఎస్ ధోని కీలక ప్రకటన..
ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సన్ రైజర్స్ జట్టు విఫలమైంది. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో మాత్రమే హైదరాబాద్ గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం చవిచూసింది.
అటు గుజరాత్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్ లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన గుజరాత్.. తర్వాతి మూడు మ్యాచుల్లోనూ విక్టరీ కొట్టింది. ముంబై, బెంగళూరు, తాజాగా హైదరాబాద్ జట్లపై గెలుపొందింది. నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో ఉంది గుజరాత్ టైటాన్స్.