IPL 2025: పంజాబ్ జట్టుపై ఓటమికి బాధ్యత ఎవరిది..? కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కామెంట్స్..

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురికావడంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Ajinkya Rahane (Cridet BCCI)

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కేకేఆర్ జట్టు విఫలమైంది. 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో 16 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.

Also Read: LSG vs CSK : చెన్నై చేతిలో ఎందుకు ఓడిపోయామంటే.. పంత్ కామెంట్స్ వైర‌ల్‌.. బిష్ణోయ్ చేత ఆఖ‌రి ఓవ‌ర్‌

కోల్‌క‌తా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేసి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించారు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో రెండు వికెట్లుతీసి తక్కువ స్కోర్ కే పంజాబ్ కింగ్స్ ను ఆలౌట్ చేశారు. దీంతో కేకేఆర్ జట్టు 112 పరుగుల లక్ష్యంను ఉఫ్ అని ఊదేస్తుందని భావించారంతా. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి. కోల్ కతా బ్యాటర్లు తడబడ్డారు. చాహల్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. గిరగిరా బంతులతో చకచకా నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ సంచలన విజయానికి కారణమయ్యాడు. ఇన్నింగ్స్ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్ చేసిన చాహల్.. 12వ ఓవర్లో రింకు సింగ్, రమణ్ దీప్ లను ఔట్ చేసి కోల్ కతా జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు.


స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురికావడంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ‘‘ ఓటమి బాధ్యతను నేను తీసుకుంటా. నేను తప్పు షాట్ ఆడాను. అది మిస్ అయ్యి ఎల్బీగా ఔటయ్యాను. ఒక జట్టుగా బ్యాటింగ్ లో మేము విఫలమయ్యాం. ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పిచ్ లపై పుల్ ఫేస్ బంతులను సులభంగా ఎదుర్కోవచ్చు. స్పిన్ బౌలింగ్ ను ఆడడం మాత్రం కష్టం. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సానుకూల ధోరణితోనే ఉంటాం. ఇంకా సగం మ్యాచ్ లు మిగిలే ఉన్నాయి. మరోసారి ఇలా జరగకుండా చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని రహానె అన్నారు.