Courtesy BCCI
ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుదూరంలో నిలిచింది. ఐపీఎల్ 2025లో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన తొలి క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. 2016 తరువాత ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. మార్కస్ స్టోయినిస్ (26) టాప్ స్కోరర్. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. యశ్ దయాళ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఫిల్ సాల్ట్ (56; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో లక్ష్యాన్ని ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో ముషీర్ ఖాన్, కైల్ జేమిసన్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరడం పట్ల ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. చిన్నస్వామిలోనే కాదు ఎక్కడ మ్యాచ్ జరిగినా కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతూ జట్టుకు హోంగ్రౌండ్ అనుభూతిని ఇస్తున్నారని చెప్పాడు. ఇంకా అయిపోలేదని, ఇంకొక్క మ్యాచ్ గెలవాల్సి ఉందన్నాడు. ఆ తరువాత అందరం కలిసి కాస్త గట్టిగానే సంబరాలు చేసుకుందామని చెప్పాడు.
CAPTAIN RAJAT PATIDAR THANKING THE RCB FANS. ❤️pic.twitter.com/23voUs9zSq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2025
LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ బిగ్ షాక్..
ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. మ్యాచ్‌లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగామని చెప్పాడు. ముఖ్యంగా పేసర్లు ఈ పిచ్‌ను చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపాడు. ఇక యువ లెగ్ స్పిన్నర్ సుయాశ్ బౌలింగ్ ను ప్రశించాడు. అతడు లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసిన విధానం బాగుందన్నడు. ‘ఓ కెప్టెన్‌గా అతడి బౌలింగ్ పై నాకు పూర్తి క్లారిటీ ఉంది. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని రీడ్ చేయడం కష్టం. అతడు స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలి. అదే అతడి బలం.’ అని పాటిదార్ అన్నాడు.
సాల్ట్‌కు పెద్ద అభిమానిని..
ఆఖరి లీగ్ మ్యాచ్, తొలి క్వాలిఫయర్‌కు మధ్య ఒక్క రోజు మాత్రమే విరామం ఉండడంతో ఆర్‌సీబీ ప్రాక్టీస్‌కు పెద్దగా అవకాశం లభించలేదు. దీనిపై పాటిదార్ మాట్లాడుతూ.. ఈ టోర్నీ ఆసాంతం చాలా ప్రాక్టీస్ చేశాం. అందువల్ల ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే వచ్చే నష్టం ఏం లేదు. అని పాటిదార్ అన్నాడు.
ఇక ఓపెనర్ ఫిల్‌సాల్ట్ గురించి మాట్లాడుతూ.. ఫిల్ సాల్ట్ చాలా బాగా ఆడతాడని, శుభారంభాలు అందిస్తాడని రజత్ పాటిదార్ తెలిపాడు. అతడి బ్యాటింగ్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పాడు. డగౌట్ నుంచి అతడి ఆటను చూడడం ఎంతో బాగుందన్నాడు. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంకొక్క మ్యాచ్ గెలవాల్సి ఉందని, ఆ తరువాత కలిసి వేడుక చేసుకుందామని చెప్పాడు.