LSG : ఏడో స్థానంతో ఐపీఎల్ సీజన్ ముగింపు.. పంత్ ఫోటోని పోస్ట్ చేస్తూ లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ట్వీట్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో తన ప్రయాణాన్ని ముగించింది.

IPL 2025 LSG owner Sanjiv Goenka one word reaction to Rishabh Pant century
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 సీజన్ ను ఓటమితో ముగించింది. మంగళవారం ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే.. ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. ఆఖరి మ్యాచ్‌లో దుమ్ములేపాడు. విధ్వంసకర శకతంతో తన జట్టుకు భారీ స్కోరు అందించాడు.
కాగా.. పంత్ సెంచరీని ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికి సోషల్ మీడియా వేదికగా అతడిని అభినందించాడు లక్నో యజమాని సంజీవ్ గొయెంకా. ప్రస్తుతం గొయెంకా ట్వీట్ వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో227 పరుగులు సాధించింది. లక్నో బ్యాటర్లలో పంత్ కాకుండా మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో తుషారా, భువనేశ్వర్, షపర్డ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్‌సీబీ బ్యాటర్లలో జితేశ్ కాకుండా కోహ్లీ (30 బంతుల్లో 54 పరుగులు), మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్) లు రాణించారు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ మహారాజ్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లు తలా ఓ వికెట్ తీశారు.
LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ బిగ్ షాక్..
కాగా.. మ్యాచ్ అనంతరం లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పంత్ సెంచరీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘Pant’astic అంటూ రాసుకొచ్చాడు. చప్పట్లతో అతడిని అభినందించాడు.
‘Pant’astic! 👏🏻 #LSGvsRCB pic.twitter.com/d83M19sKP8
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 27, 2025
ఈ ఓటమితో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.