ఐపీఎల్ అంటే భారత్‌లోని క్రికెట్ అభిమానులకు ఓ పండుగ. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ మ్యాచుల సందడి దేశ వ్యాప్తంగా కనపడుతుంది. ఐపీఎల్ -2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ -2025 వేళ బీసీసీఐ కొత్తగా మూడు నిబంధనలను తీసుకొచ్చింది.
సలైవాపై బ్యాన్ రద్దు
ఐపీఎల్‌లో బౌలర్లు బంతికి సలైవా (ఉమ్మి) రుద్దడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. సలైవా వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారని, ఐపీఎల్‌లో ఆడుతున్న మెజారిటీ కెప్టెన్లు దీనికి సానుకూలంగా స్పందించారని బీసీసీఐ ఉన్నతాధికారి ఇప్పటికే చెప్పారు. కరోనా సమయంలో ఆ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా బాల్‌పై సలైవాను పూయడాన్ని ఐసీసీ నిషేధించింది. దీంతో ఐపీఎల్లో కూడా ఈ నిషేధాన్ని బీసీసీఐ చేర్చింది. గత ఏడాది ఐపీఎల్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంది.
Also Read: గుడ్‌న్యూస్.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు..
రెండో ఇన్నింగ్స్‌లో రెండో బాల్
మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ కోసం రెండో బంతి అనే కొత్త నియమాన్ని కూడా బీసీసీఐ ఈ ఏడాది తీసుకొచ్చింది. ముంబైలోని క్రికెట్ సెంటర్‌లో తాజాగా కెప్టెన్ల, మేనేజర్ల సమావేశం జరిగింది. దీనిలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ అనంతరం రెండో బాల్‌ను తీసుకునే అవకాశం ఉంది.
రాత్రుళ్లు జరిగే ఈ మ్యాచ్‌పై పడే మంచు బిందువుల ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం రెండో బాల్‌ను వాడుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ బాల్ మార్పు విషయాన్ని బీసీసీఐ అంపైర్ల అభీష్టానికి వదిలివేసింది. బంతిని మార్చాలా వద్దా అన్న విషయంపై అంపైర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో జరిగే మ్యాచ్‌లలో రెండవ బంతిని ఉపయోగించే ఛాన్స్ లేదు.
వైడ్లకు కూడా డీఆర్‌ఎస్ తీసుకోవచ్చు
డీఆర్ఎస్‌కు అప్పీల్ చేసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి. హైట్ వైడ్‌లు, ఆఫ్ సైడ్ వైడ్‌ల కోసం కూడా ఇకపై డీఆర్ఎస్‌ను వాడుకోవచ్చు. ఈ మేరకు డిసిషన్ రివ్యూ సిస్టమ్‌లో మార్పులు చేశారు. అయితే, లెగ్-సైడ్ వైడ్‌ల విషయంలో మాత్రం డీఆర్‌ఎస్‌ను ఉపయోగించే అవకాశం లేదు. దీనిపై ఆన్-ఫీల్డ్ అంపైర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌ను గత ఏడాదిలానే కొనసాగించాలి. మరోవైపు, స్లో ఓవర్ రేట్ వల్ల కెప్టెన్లపై నిషేధం వంటివి ఉండవు.