McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు..

ఇప్పటికే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ ప్యాటీల కోసం గుజరాత్ నుంచి మెక్‌డొనాల్డ్స్‌ ఆలుగడ్డలను కొంటోంది.

McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు..

Updated On : March 21, 2025 / 3:31 PM IST

అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌లో లభ్యమయ్యే ఫుడ్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. తెలంగాణలోనూ 38 మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్లు ఉన్నాయి. అంతేగాక, హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌ గ్లోబల్ ఆఫీసుని ప్రారంభించనుంది. తాజాగా మెక్‌డొనాల్డ్స్‌ నుంచి తెలంగాణ రైతులకు మరో గుడ్‌న్యూస్‌ అందింది. ఫుడ్ తయారీ కోసం తెలంగాణలోని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.

ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి మెక్‌డొనాల్డ్స్‌ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ ప్యాటీల కోసం గుజరాత్ నుంచి మెక్‌డొనాల్డ్స్‌ ఆలుగడ్డలను కొంటోంది. కర్ణాటకలోని చిక్కమగళూరు నుంచి అరబికా కాఫీ గింజలను కొనుగోలు చేస్తోంది. లాహౌల్, స్పితి, నాసిక్, ఊటీ నుంచి లెట్యూస్.. పశ్చిమ భారత్‌ నుంచి టమాటాలను కొంటోంది. ఇప్పుడు కొన్ని తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను కూడా తమ ఫుడ్‌ తయారీలో వాడాలని భావిస్తోంది.

తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మెక్‌డొనాల్డ్‌ చైర్మన్‌, సీఈవో క్రిస్‌ కెంప్జిన్సి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను వాడుకోవాలని క్రిస్‌ కెంప్జిన్సికి రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.

“తెలంగాణ నుంచి ఏయే వ్యవసాయ ఉత్పత్తులు కొనాలనుకుంటున్నారనే విషయంపై వారు త్వరలో మాకు వివరాలు తెలుపుతారు. రాష్ట్రం నుంచి మిరపకాయలు, పసుపు, నువ్వులను కొనొచ్చన్న ప్రతిపాదన ఉంది” అని తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

నిజామాబాద్‌లో పండించే తెలంగాణ ఆర్మూర్ పసుపు చాలా ప్రసిద్ధి చెందింది. దానికి పొడవాటి వేర్లు ఉంటాయి. అధిక పసుపు ఉత్పత్తి జరుగుతుంది. జిఐ ట్యాగ్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, తెలంగాణలోని వరంగల్‌లో చపాటా మిరపకాయ, ఖమ్మం జిల్లాలో తేజా మిరపకాయ వంటి మిరప రకాలు ఉన్నాయి.

ఆలియోరెసిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బాగా ఎరుపు రంగులో వరంగల్ చపాటా మిరపకాయ ఉంటుంది. ఇప్పటికే ఈ మిరపకాయలకు కూడా జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేశారు. త్వరలో ఎప్పుడైనా జీఐ ట్యాగ్ రావచ్చు. మెక్‌డొనాల్డ్స్ తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను కొంటే రాష్ట్ర అగ్రి ఎకానమ మరింత మెరుగుపడుతుంది. స్థానిక రైతులు ఆదాయాలు పెరుగుతాయి.