IPL 2026 Auction Prithvi Shaw sold to Delhi Capitals
Prithvi Shaw : మరో సచిన్ అవుతాడు అంటూ అందరూ మెచ్చుకున్న ఆటగాడు పృథ్వీ షా. అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటంలో అతడి మెరుపులు అలా ఉన్నాయ్ మరీ. కట్ చేస్తే.. ఎంత త్వరగా టీమ్ఇండియా తలుపు తట్టాడో అంతే త్వరగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీలో రాణించి మళ్లీ టీమ్ఇండియా తరుపున అద్భుత ప్రదర్శన చేస్తారని అంతా ఆశించారు కానీ.. అలా జరగడం లేదు.
ఫామ్‌లేమీ, ఫిట్‌నెస్ సమస్యలు, మైదానం బయట గొడవలతో అతడు వార్తల్లో నిలవడం తప్ప ఆటతో పృథ్వీ పేరు విని చాన్నాళ్లు అయింది. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతడిని ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. అయితే.. అప్పుడు మెగావేలంలో అతడిని ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.
IPL 2026 auction : కార్తిక్ శర్మ.. రూ.14 కోట్లకు కొన్న CSK.. ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి?
ఇక ఏడాది తరువాత ఐపీఎల్ 2026 మినీ వేలంలో తొలి సెట్‌లో వచ్చిన అతడిని మరోసారి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత సెకండ్ యాక్సిలరేటెడ్ రౌండ్‌లో కూడా పృథ్వీ ని కొనేందుకు ఏఫ్రాంచైజీల రాలేదు. దీంతో అతడు మరోసారి అన్‌సోల్డ్ మిగిలిపోతాడని అంతా భావించారు.
ఇక పృథ్వీ కూడా అలాగే అనుకున్నాడు. అందుకనే తన ఇన్‌స్టాగ్రామ్లో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. అయితే.. ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనికరించింది. 75 లక్షలకు అతడిని ఢిల్లీ దక్కించుకుంది. దీంతో అతడు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముందు పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేసి బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ మరో పోస్ట్ చేశాడు.
2018లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.20 కోట్లకు పృథ్వీ షాను కొనుగోలు చేసింది. అతడు ఆ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. దాదాపు ఏడు సీజన్లు అతడు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2021 సీజన్ వరకు 1.20 కోట్లు అందుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ అతడిని 7.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక ఐపీఎల్ 2023, 24 సీజన్‌లలో 8 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. పేలవ ప్రదర్శనతో ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు వేలానికి విడిచిపెట్టింది. ఏడాది తరువాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది. మరి ఈ సారి అయినా పృథ్వీ షా రాణించి అంచనాలను అందుకుంటాడో లేదో మరీ.