CSK vs KKR : సాకులు చెప్ప‌డం లేదు.. చెమ‌ట ఉంది.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని(CSK vs KKR ) సాధించింది. మంగ‌ళ‌వారం చెపాక్ మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై 32 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2026 CSK vs KKR Ruturaj Gaikwad comments Chennai Super Kings beat Kolkata Knight Riders (pic credit@ipl)

  • వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించిన సీఎస్‌కే
  • మంగ‌ళ‌వారం కోల్‌క‌తా పై విజ‌యం
  • గెలిచిన జ‌ట్టులో ఉండ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌న్న రుతురాజ్ గైక్వాడ్‌

CSK vs KKR : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించింది. మంగ‌ళ‌వారం చెపాక్ మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై 32 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంపై ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌. క్ర‌మంగా త‌మ జ‌ట్టు మెరుగు అవుతోంద‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో సంజూశాంస‌న్ (32 బంతుల్లో 48 ప‌రుగులు ), డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 41 ప‌రుగులు), ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 38 ప‌రుగులు) రాణించారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి రెండు, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత ర‌మ‌ణ్‌దీప్ సింగ్ (23 బంతుల్లో 35 ప‌రుగులు), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 31 ప‌రుగులు) రాణించిన‌ప్ప‌టికి కూడా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 193 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. చెన్నై బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ మూడు, అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు సాధించాడు. ఖలీల్ అహ్మద్, అకీల్ హోసేన్ లు చెరో వికెట్ తీశారు.

CSK vs KKR : జ‌ట్టులో భారీ మార్పులు త‌ప్ప‌దు.. సీఎస్‌కే పై ఓట‌మితో అజింక్యా ర‌హానేకు జ్ఞానోద‌యం..!

మ్యాచ్ అనంత‌రం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కేకేఆర్ పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. బౌల‌ర్లు రాణించ‌డంతోనే 190 ప‌రుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నామ‌ని తెలిపాడు. ఇక మ్యాచ్‌లో గెలిచిన‌ప్ప‌టికి కూడా త‌మ ఫీల్డింగ్ ఇంకాస్త మెరుగు అవ్వాల్సి ఉంద‌ని అన్నాడు.

నిజం చెప్పాల‌టే.. తొలి 7-8 ఓవ‌ర్ల త‌రువాత పిచ్ మారిపోయింద‌న్నాడు. పిచ్ స్పిన్‌కు స‌హ‌క‌రిస్తుండ‌డంతో పాటు బంతి ఆగుతూ వ‌స్తోంద‌న్నాడు. తొలుత ఈ పిచ్ పై 210 లేదా 220 ప‌రుగులు మంచి స్కోరు అని భావించామ‌ని, ఆ త‌రువాత 180 లేదా 190 స్కోరు చేసినా స‌రిపోతుంద‌ని అనిపించింద‌న్నాడు.

ఆ విభాగంలో ఇంకాస్త మెరుగు అవ్వాలి

త‌మ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశార‌న్నాడు. ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క్క‌గా అమ‌లు చేశార‌న్నాడు. ఇక త‌మ జ‌ట్టు క్రమ క్ర‌మంగా మెరుగుఅవుతోంద‌న్నాడు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏమిటో, ఏ స‌మ‌యంలో ఎలా ఆడాలి అనే విష‌యాలు అర్థ‌మవుతోంద‌న్నాడు. ఇక నూర్ అహ్మ‌ద్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఫీల్డింగ్ లోపాల‌పై స్పందిస్తూ.. ఈ విభాగంలో తాము మెరుగు ప‌డాల్సి ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. ఒక‌టి లేదా రెండు క్యాచ్‌ల‌ను మాత్ర‌మే ప‌ట్టుకున్నామ‌ని, చాలా వాటిని మిస్ చేశామ‌ని తెలిపాడు. చేతుల‌కు చెమ‌ట ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇలా జ‌రిగింద‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఇదేమీ సాకు కాద‌ని అన్నాడు. ఈ విభాగంలో మెరుగు ప‌డాల్సి ఉంద‌న్నాడు.

ఇక చాలా కాలం త‌రువాత గెలిచిన జ‌ట్టులో ఉండ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. గ‌త మ్యాచ్ త‌రువాత తాను కాస్త రిలాక్స్ అయ్యాన‌ని అన్నాడు. త్వ‌ర‌లోనే తాను ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌తాన‌ని అన్నాడు. మాన‌సికంగా చాలా సానుకూలంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. జ‌ట్టుకు అవ‌స‌రం అయిన‌ప్పుడు తాను త‌ప్ప‌క రాణిస్తాన‌ని చెప్పాడు.