Ipl2022 Csk Vs Rcb
IPL2022 CSK Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై 5వ మ్యాచ్ లో గెలుపు రుచి చూసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 23 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
చెన్నై నిర్దేశించిన 217 భారీ టార్గెట్ తో ఛేదనకు దిగిన బెంగళూరు 193 పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాటర్లలో షాబాద్ అహ్మద్ (27 బంతుల్లో 41 పరుగులు), సుయశ్ ప్రభుదేశాయి (18 బంతుల్లో 34 పరుగులు), దినేష్ కార్తిక్(14 బంతుల్లో 34 పరుగులు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (26) రాణించారు. చెన్నై బౌలర్లలో మహేశ్ తీక్షణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. ముకేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీశారు.(IPL2022 CSK Vs RCB)
Sunil Gavaskar: కోహినూర్ ఏం చేశారంటూ.. బ్రిటీష్ కామెంటేటర్‌పై గవాస్కర్ సెటైర్
వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై గెలుపొందటం విశేషం. కాగా, బెంగళూరు జట్టుకిది రెండో ఓటమి. కెప్టెన్ డు ప్లెసిస్ (8), అనుజ్ రావత్ (12), విరాట్ కోహ్లీ (1), వనిందు హసరంగ (7), ఆకాశ్ దీప్ (0) నిరాశ పరిచారు. మహమ్మద్ సిరాజ్ (10), జోష్ హేజిల్ వుడ్ (7) నాటౌట్‌గా నిలిచారు.
వరుస ఓటముల నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో తొలుత బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబె పూనకం వచ్చినవాడిలా విరుచుకుపడ్డారు. సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప వీరబాదుడు బాదాడు. దూబె 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి.
అటు ఊతప్ప 50 బంతుల్లో 88 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. శివమ్ దూబే, ఊతప్ప జోడీ ఆడుతున్నంత సేపు బెంగళూరు బౌలర్లు ఏ బంతి వేయాలో, ఎక్కడ వేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. మీడియం పేసర్ ఆకాష్ దీప్ ఒక ఓవర్ లో తీవ్ర ఒత్తిడికి లోనై, అనేక వైడ్లు విసిరాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా, బంతిని చితకబాది స్టాండ్స్ లోకి తరలించడమే తమ పని అన్నట్టుగా దూబె, ఊతప్ప బ్యాట్లు ఝుళిపించారు. ఇక, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేయగా, మొయిన్ అలీ 3 పరుగులు చేశాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు.
IPL2022 SRH Vs GT : గుజరాత్ జైత్రయాత్రకు హైదరాబాద్ బ్రేక్.. సీజన్‌లో తొలి ఓటమి..
కాగా, చివరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తవుతుందన్న నేపథ్యంలో, దూబే భారీ షాట్ కు యత్నించినా, అది బౌండరీ దాటలేదు. డుప్లెసిస్ క్యాచ్ పట్టినా, సరిగా బంతిని చేతిలో నిలపలేకపోవడంతో దూబే నాటౌట్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో వనింద హసరంగ 2 వికెట్లు తీయగా, హేజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.