Kapil Dev on Virat Kohli
Kapil Dev on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ మళ్ళీ ఫాంలోకి రావడానికి ఎంతో కాలం పట్టదని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. విరాట్ కొహ్లీ ఆటతీరు కొంత సరిగ్గా ఉండడం లేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం యూఏఈలో కొనసాగుతోన్న ఆసియా కప్ ద్వారా మళ్ళీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఈ నెల 28న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేసి రవీంద్ర జడేజా (35 పరుగులు)తో కలిసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అతడి ఆటతీరుపై ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ స్పందిస్తూ… నెల రోజుల తర్వాత తిరిగి అంతర్జాతీయ మ్యాచులో ఆడిన కొహ్లీ ఆటతీరు బాగుందని అన్నారు. అతడు ఆడిన పలు షాట్లు మ్యాచుపై ప్రభావం చూపాయని తెలిపారు. ఇకపై కూడా అటువంటి షాట్లు ఆడతాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కొహ్లీ ఆటతీరును తాను ఇవాళే కాకుండా గత 10 ఏళ్ళుగా ఇష్టపడుతున్నానని తెలిపాడు. అతడి ఆట తీరే మిగతా ఆటగాళ్ళ కంటే అతడిని ఉత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నారు.
కొహ్లీ ఫాంపై విమర్శలు వస్తున్నాయని, అయితే, తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న విషయాన్ని అతడు గుర్తుంచుకోవాలని కపిల్ దేవ్ చెప్పారు. ప్రతి మ్యాచులోనూ అధిక పరుగులు సాధించడం ఏ ఆటగాడికీ సాధ్యం కాదని, అలాగే, ప్రతి మ్యాచులోనూ ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగే పరిస్థితులూ ఉండవని అన్నారు. కొహ్లీ నైపుణ్యం, సామర్థ్యం చూస్తే అతడు తిరిగి ఫాంలోకి రావడానికి ఎంతో కాలం పట్టదని అర్థం చేసుకోవచ్చని చెప్పారు.