‘ధోనీకి 2సార్లు అవకాశమివ్వడమే మా కొంపముంచింది’

ఆడటమంటే ఏంటో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేర్పించాడంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, ఎంఎస్ ధోనీలు సూపర్ స్టార్లంటూ కొనియాడాడు. అటువంటి ధోనీకి నిర్ణయాత్మక వన్డేలో పలు అవకాశాలు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామని ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ 0, 74 పరుగుల వద్ద అవుట్ అయ్యే అవకాశాలున్నా ఆసీస్ ప్లేయర్లు సరిగా వినియోగించుకోలేకపోయారని విమర్శించాడు. ఈ వన్డే సిరీస్‌లో ధోనీ 37 ఏళ్ల వయస్సులోనూ స్టంప్‌ల మధ్య అంత వేగంగా కదలడం చూసి ఆసీస్ యువ క్రికెటర్లు చాలా నేర్చుకోవాలన్నాడు.
తొలి బంతికే ధోని ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ జారవిడిచాడు. దాంతో పాటు మరోసారి అప్పిల్ చేయకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. సిడిల్ వేసిన 39వ ఓవర్‌లో బంతి ధోని బ్యాట్‌కు ఎడ్జై కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. కానీ ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయలేదు. ఇలా ధోని 2 సార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించిన ధోని(87 నాటౌట్: 114 బంతులు,6 ఫోర్లు)తో ముగించాడు. దాంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి.. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఓటమి గురించి ఆసీస్ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇలా మాట్లాడాడు.
‘ఆసీస్ గెలిచేందుకు శాయశక్తులా పోరాడింది. కానీ 2-1తో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. టెస్టు సిరీస్‌లానే ఈ సిరీస్‌ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయాం. ఈ సిరీస్‌లో కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. స్టోయినిస్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ద్వారా రిచర్డ్సన్ అతను అద్భుతంగా బౌలింగ్ చేసి వెలుగులోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో హ్యాండ్‌స్కోంబ్ ఆసాధారణ ప్రదర్శన కనబర్చాడు. షాన్ మార్ష్ సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. ధోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన బ్యాటర్స్ అందరికి ఓ మార్గదర్శకత్వంలాంటింది.’ అని చెప్పుకొచ్చాడు.