మనం వాడిపడేస్తున్న స్మార్ట్ఫోన్లలో అరుదైన ఖనిజాలు.. వీటిని ఇలా వాడితే భారత్‌కు తిరుగు ఉండదు..
ఇవి యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగపడతాయి. వీటిని రిసైకిల్ చేస్తే భారత్‌కు తిరుగుండదు.
Rare Earth Minerals: భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. అలాగే, అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు కనపడుతుంటాయి. ఇక పాడైపోయిన స్మార్ట్ఫోన్ల భారతీయుల ఇళ్లలో అతి భారీగా ఉన్నాయి.
దుమ్ము పట్టి ఓ మూలనపడి ఉండే ఈ పాత స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సాధారణ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కాదు. శాస్త్రీయ దృష్టిలో ఇవి అధిక సాంద్రత ఉండే ఖనిజ నిల్వలు. భారతదేశం అణు స్వావలంబన దిశగా సాగుతోంది.
ఇది సాధించాలంటే ఖనిజాల తవ్వకం నుంచి తుది తయారీ వరకు ప్రతి దశపై పూర్తి పట్టు అవసరం, విదేశాలపై ఆధారపడకూడదు.
ఇటువంటి సమయంలో ఇందుకు ఉపయోగపడే ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లో అరుదైన ఖనిజాలు!
ప్రతి పాత ల్యాప్‌టాప్, ఫోన్లో అరుదైన ఖనిజాలు ఉంటాయి. నియోడైమియం, సమారియం వంటి అరుదైన మూలకాల మిశ్రమాలతో తయారైన శాశ్వత శక్తిమంతమైన మ్యాగ్నెట్స్ ఉంటాయి.
ఇవి యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగపడతాయి. వీటిని రిసైకిల్ చేస్తే భారత్‌కు తిరుగుండదు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గ్రేటర్ నోయిడా కేంద్రంగా ఉన్న లోహమ్ సంస్థ రీసైక్లింగ్ విభాగాధిపతి సయ్యద్ గజన్ఫర్ అబ్బాస్ సఫ్వీ దీనిపై మాట్లాడుతూ.. “సాధారణ కోబాల్ట్ గని ఒక టన్ను రాతిలో 1 నుంచి 2 కిలోల కోబాల్ట్ ఇస్తుంది. కానీ, వాడిపోయిన బ్యాటరీ పదార్థం ఒక టన్నులో 50 నుంచి 80 కిలోల వరకు ఉంటుంది, అంటే 40 రెట్లు ఎక్కువ సాంద్రత” అని చెప్పారు.
