ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన నాయర్ 205 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకమైంది. అతడి పై వేటు వేయాలని మాజీలతో పాటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమయంలో దేశవాళీ క్రికెట్‌లో రాణించి స్వదేశంలో జరగనున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లల్లో జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు కరుణ్ నాయర్. అయితే.. అతడికి ఓ షాక్ తగిలింది. గాయం కారణంగా అతడు దులీప్ ట్రోఫీ 2025 దూరం అయ్యాడు. అతడు దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.
Yashasvi Jaiswal : ముంబై టు గోవా.. నో.. నో.. యశస్వి జైస్వాల్ యూటర్న్ వెనుక అసలు కారణం ఇదేనా..
అతడి చేతి వేలికి స్వల్ప గాయమైంది. వైద్యుల సూచన మేరకు దులీప్ ట్రోఫీకి కరుణ్ నాయర్ దూరంగా నిర్ణయించుకున్నాడని సమాచారం. అతడు దులీప్ ట్రోఫీ ఆడకపోతే విండీస్, దక్షిణాఫ్రికాలతో జరిగే టెస్టు సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.
‘ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఓ బంతి కరుణ్ నాయర్ చేతి వేలికి తాకింది. దీంతో చిన్న వాపు కూడా వచ్చింది. దీంతో అతడు దులీప్ ట్రోఫీలో ఆడడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌లు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 15 వరకు జరగనున్నాయి.