Chris Woakes : రిషబ్ పంత్‌కు సారీ చెప్పిన క్రిస్‌వోక్స్.. వాయిస్ నోట్ పంపిన టీమ్ఇండియా వికెట్ కీపర్.. ఏమన్నాడంటే..?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఫలితం సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు.

Chris Woakes apologies to Rishabh Pant for this reason after the Oval Test
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఫలితం సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. తీవ్రమైన గాయాలతో సతమతం అవుతున్నా కూడా తమ తమ దేశాల కోసం మైదానంలో దిగారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. ఒకరు టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కాగా.. మరొకరు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ క్రిస్‌వోక్స్.
నాలుగో టెస్టులో క్రిస్‌వోక్స్ బంతిని రివర్స్ స్వీప్ చేస్తూ రిషబ్ పంత్ పాదానికి గాయం కాగా.. ఐదో టెస్టు మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో డైవ్ చేయడంతో క్రిస్ వోక్స్ ఎడమ భుజం స్థాన భ్రంశం చెందింది.
ఆఖరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరం అయిన సమయంలో క్రిస్‌వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం వోక్స్‌ను కెప్టెన్ గిల్ తో పాటు టీమ్ఇండియా ఆటగాళ్లు అభినందించారు. ఈ విషయాన్నే వోక్స్ తాజాగా వెల్లడించాడు.
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నానని గిల్ అభినందించాడు. ఇప్పటికి కూడా తాను బ్యాటింగ్‌కు రావాలని నిర్ణయించుకోవడం సరైందిగానే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో 100 పరుగులు చేయాల్సి ఉన్నా కూడా తాను బ్యాటింగ్‌కు వెళ్లేవాడినన్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోవడం ఇప్పటికి ఎంతో బాధిస్తుందన్నాడు. తానే కాదని ఎవరైనా సరే జట్టు కోసం ఇదే చేస్తారన్నాడు.
తాను బ్యాటింగ్‌కు దిగిన ఫోటోను ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేస్తూ పంత్ సెల్యూట్ ఎమోజీ పెట్టినట్లుగా వోక్స్ తెలిపాడు. దాన్ని చూసి తాను థ్యాంక్ చెప్పినప్పుడు వివరించాడు. అదే సమయంలో పంత్ గాయం గురించి వాకబు చేసినట్లు తెలిపాడు. ఇందుకు పంత్ స్పందిస్తూ “అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. త్వరగా కోలుకోవాలి. తప్పకుండా మనం ఏదొక రోజు కలుద్దాం.” అని ఓ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలిపాడు. తన బౌలింగ్‌లో పంత్ పాదం అలా కావడం పై స్పందిస్తూ.. అతడికి సారీ చెప్పినట్లు వోక్స్ చెప్పాడు.