Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన తరువాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకాతో కేఎల్ రాహుల్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత ఐపీఎల్ సీజన్ వరకు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన సంగతి తెలిసిందే. అతడి నాయకత్వంలో లక్నో మంచి ప్రదర్శనలే చేసింది. అయితే.. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పుడు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ పై మైదానంలోనే లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Kl Rahul : చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్..
Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic
— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ఓ సారథిని అలా బహిరంగంగా నిలదీయడం తప్పని గోయెంకాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయిన్పపటికి గోయెంకా తీరు మారలేదు. కేఎల్‌ను వదలివేశాడు. పంతానికి పోయి రిషబ్ పంత్ ను మెగా వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేశాడు. అటు కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో దక్కించుకుంది.
కట్ చేస్తే.. పంత్ సారథ్యంలోని లక్నో ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. బ్యాటర్‌గా పంత్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. మరోవైపు రాహుల్ మాత్రం అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక లక్నో పై విజయం తరువాత ఆటగాళ్లతో కరచాలనం చేస్తుండగా.. సంజీవ్ గోయెంకా, ఆయన కొడుకు శశ్వాంత్ గోయెంకా మైదానంలోనే ఉన్నారు. వారిద్దరికి సైతం రాహుల్ షేక్‌హ్యాండ్ ఇచ్చి ముందుకు వెళ్లబోయాడు.
అయితే.. రాహుల్‌ను ఆపి మాట్లాడేందుకు వారు ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ మాత్రం వారితో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గతేడాది జరిగిన ఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ.. గోయెంకా తిక్క కుదిరిందని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ సరైన గుణపాఠం చెప్పాడని అంటున్నారు.