Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఫిల్‌సాల్ట్ (37; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (37నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (25)లు ఫర్వాలేదనిపించారు. పడిక్కల్ (1), లియామ్ లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ(3) లు విఫలం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్లు) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. యశ్ దయాల్, సుయాష్ శర్మఓ వికెట్ సాధించాడు.
ఇది నా అడ్డ..
బెంగళూరు నా సొంత మైదానం. ఇక్కడ ఎలా ఆడాలో నా కంటే బాగా ఇంకెవరి తెలుస్తుంది అని కేఎల్ రాహుల్ అన్నాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో రాహుల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తరువాత రాహుల్ మాట్లాడుతూ.. 20 ఓవర్ల పాటు వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందో చూడడం తనకు ఎంతో సాయపడిందన్నాడు. వికెట్‌లో కొంచెం స్థిరంగా ఉందని గ్రహించాను. అయితే.. అంతా కాదు. ఏ బ్యాటర్ ఎలాంటి షాట్లు ఆడి ఔట్ అయ్యారో గమనించాను. బ్యాటింగ్‌లో ఇది ఎంతో ఉపయోగపడింది. అని చెప్పుకొచ్చాడు.
‘నా బలం ఏంటో, ఎలాంటి షాట్లు కొట్టగలనో నాకు ఓ స్పష్టత ఉంది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడాలని అనుకున్నాను. ఆ క్యాచ్ మిస్ కావడం లక్కీ. ఇది నా ఇల్లు. ఇది నా మైదానం. ఇక్కడ ఎలా ఆడాలో అందరి కంటే నాకే బాగా తెలుసు. ఇక్కడ ఆడటాన్ని ఎంతో ఆస్వాదించాను.’ అని రాహుల్ అన్నాడు.
కేఎల్ రాహుల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు రంజీలో కర్ణాటక తరుపున చిన్నస్వామి స్టేడియంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలోని పిచ్, పరిస్థితులపై ఆర్‌సీబీలోని చాలా మంది ఆటగాళ్ల కంటే కూడా కేఎల్ రాహుల్‌కు ఎంతో అవగాహన ఉంది. ఇదే విషయాన్ని రాహుల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.