KL Rahul: ప్రపంచకప్ ఫైనల్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయబ్ మాలిక్ విమర్శలు

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా వికెట కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Shoaib Malik : వన్డే ప్రపంచకప్ ఆరంభం నుంచి జోరు చూపించినప్పటికీ టీమిండియా విజేత కాలేకపోయింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో రాణించి ఆసీస్ ప్రపంచకప్ టైటిల్ సాధించింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా అసమాన పోరాటంతో విజేతగా నిలిచింది. అయితే మిడిలార్డర్ లో స్లోబ్యాటింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడాన్ని అతడు తప్పుబట్టాడు.

​”కేఎల్ రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అలా చేయకుండా అతడు తన సొంత శైలిలో ఆట ఆడివుంటే బాగుండేది. కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌండరీలు కొట్టడం కష్టమైతే స్ట్రైక్‌ని రొటేట్ చేయాలి. కానీ అలా జరగలేదు. రాహుల్ చాలా బంతులను వేస్ట్ చేశాడు. టీమిండియా త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు అతడు చాలా బాధ్యతగా ఆడాడు. 107 బంతుల్లో 66 పరుగులు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ కాదు. ఆట చివర వరకు ఆడాలన్న ఉద్దేశంతో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఇంకాస్త వేగంగా ఆడాల్సింద​”ని ఒక సోర్ట్స్ చానల్ లో మాట్లాడుతూ షోయబ్ మాలిక్ అన్నాడు.

అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ తో పోలిస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కష్టమే అయినప్పటికీ టీమిండియా కంటే ఆస్ట్రేలియన్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారని వివరించాడు. ఆసీస్ ఆటగాళ్లు ఎక్కువగా బౌండరీలు కొట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారని, అలాగే బౌలర్లు కూడా వైవిధ్యమైన బంతులతో భారత బ్యాటర్ల భరతం పట్టారని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారని చెప్పాడు.

Also Read: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భార్య‌ల‌పై నోరు పారేసుకున్న హర్భజన్ సింగ్‌.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు

కాగా, ప్రపంచకప్ ఫైనల్లో కేఎల్ రాహుల్ ఆటతీరుపై క్రికెట్ అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. స్టైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యాడన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను ఎక్కువ చాన్స్ తీసుకోకుండా ఉండిపోవడాన్ని విమర్శిస్తున్నారు. కాస్త దూకుడు ప్రదర్శించివుంటే మరిన్ని పరుగులు వచ్చేవని అభిప్రాయపడుతున్నారు. అయితే కఠిన పరిస్థితుల్లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని బ్యాటింగ్ చేయడం అలా సులభం కాదన్నవారూ లేకపోలేదు. ఏదీఏమైనా టీమిండియా ప్రపంచకప్ గెలవకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ట్రెండింగ్ వార్తలు