టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే తమ లక్ష్యమని వేరువేరు సందర్భాల్లో వీరిద్దరు చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వీరిద్దరు 2027 వన్డే ప్రపంచకప్ ఆడగలరా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వన్డే ప్రపంచకప్‌కు మరో రెండేళ్ల సమయం ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మల వయస్సు, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో వారి పాత్ర గురించి చర్చలు జరుగుతున్నాయి. అటు బీసీసీఐ కూడా 2027 ప్రపంచకప్ కోసం ఓ కొత్త జట్టును నిర్మించాలని చూస్తోంది. యువ ఆటగాళ్ల నుంచి పోటీవస్తున్న క్రమంలో తమ స్థానాలను కాపాడుకునే బాధ్యత కోహ్లీ, రోహిత్ లపైనే ఉంది.
రాబోయే వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరుగుతుంది. ఆఫ్రికాలోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు ఎక్కవగా అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ, రోహిత్‌లకు కీలకం కానుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఒకవేళ రోహిత్, కోహ్లీలు ఈ మ్యాచ్‌ల్లో విఫలం అయితే మాత్రం వారిపై వేటుపడడం ఖాయం.
వన్డే ప్రపంచకప్ ముందు వరకు భారత్ కేవలం 27 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌లు కూడా వివిధ సిరీసుల్లో టీ20లు, టెస్టు సిరీస్‌ల మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం వన్డేలు మాత్రమే ఆడుతూ రోకో ద్వయం ఫామ్‌ను కొనసాగించడం పైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
APL : శుక్రవారం నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్..
అప్పుడు మిస్సైంది..
స్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తృటిలో కప్‌ను చేజార్చుకుంది. వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో కెప్టెన్‌గా వన్డే ప్రపంచకప్‌ను ఎత్తాలన్న రోహిత్ కల చెదిరిపోయింది. నాటి ఫైనల్ ముగిసిన తరువాత రోహిత్ శర్మ, కోహ్లీలతో పాటు యావత్ భారత్ భావోద్వేగానికి లోనైంది.