APL : శుక్రవారం నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్..
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది.

Andhra Premier League 2025 Starts from tomorrow
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం ఏడు జట్లు సింహాద్రి వైజాగ్, తుంగ భద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్ షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
కాగా.. ఈ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీఎల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఉన్నారన్నారు.
ఇక ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.35 లక్షల నగదు బహుమతిని అందించనున్నట్లు చెప్పారు. రన్నరప్ రూ.25 లక్షలు గెలుచుకుంటారన్నాడు. ఏపీఎల్‌లో ప్రతిభ చూపేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సీజన్‌లోని మ్యాచ్‌లు చూసేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సంబంధించిన సెలక్టర్లు సైతం వస్తారన్నారు.
ఈ సీజన్‌లో మ్యాచ్‌ల్లో డీఆర్ఎస్ విధానాన్ని సైతం తీసుకువస్తున్నట్లు చెప్పారు. మైదానంలోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని క్రికెట్ ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక టీవీల్లో సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు వివరించారు.