Indian cricketer Sunil Gavaskar Stunning Vow If India Win Womens World Cup 2025
Sunil Gavaskar : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆదివారం (నవంబర్ 2)న దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా.. ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధించినా కూడా కొత్త ఛాంపియన్ కానుంది. ఇప్పటి వరకు భారత్, దక్షిణాప్రికాలు వన్డే ప్రపంచకప్‌ను సాధించలేవు.
ఈ ఫైనల్ పోరుకు ముందు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఫ్యాన్స్‌కు ఓ హామీ ఇచ్చారు. భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంటే తాను సెమీస్‌లో శతకంతో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి పాట పాడతానని చెప్పాడు. అయితే.. ఇందుకు జెమీమా ఒప్పుకుంటేనే అని అంటూ కండిషన్ పెట్టాడు. ఇక భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ 2024లో విజయం సాధించినప్పుడు గవాస్కర్ గ్రౌండ్‌లోనే డ్యాన్స్ చేసిన సంగతిని అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు.
‘ఒకవేళ టీమ్ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే, జెమీమా ఒకే అంటే ఆమెతో కలిసి ఓ పాట పాడుతా. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. ఆమె గిటార్ వాయిస్తూ ఉంటే నేను పాడుతా.’ అని గవాస్కర్ అన్నారు.
వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితం ఓ సారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో అలా చేసిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. ‘అప్పుడు ఒక బ్యాండ్ ప్లే అవుతుంది. మేమిద్దరం జాయిన్ అయ్యాం. జెమీమా గిటార్ వాయిస్తోంది. నేను పాట పాడాను. అందుకనే భారత్ ప్రపంచకప్ గెలిస్తే మరోసారి అలా చేస్తా అని హామీ ఇస్తున్నా. అయితే.. ఇది జెమీమా ఒప్పుకుంటేనే సాధ్యం. అని గవాస్కర్ అన్నాడు.
గవాస్కర్ ప్రస్తావించిన సంఘటన బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో జరిగింది.