Harmanpreet Kaur : ఏవేవో లెక్కలు వేస్తుంటుంది.. ఏం చెప్పాలో అర్థంకావడం లేదు.. జెమీమా రోడ్రిగ్స్ పై హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్..
సెమీస్‌లో ఆసీస్ పై విజయం సాధించడం పై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆనందాన్ని వ్యక్తం చేసింది.
 
                            Harmanpreet Kaur comments after india beat australia in Womens World Cup 2025 semis
Harmanpreet Kaur : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కాగా.. ఆసీస్ పై విజయం సాధించడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన భావాలను వ్యక్తం చేసేందుకు మాటలు రావడం లేదంది.
మ్యాచ్ అనంతరం హర్మన్ మాట్లాడుతూ.. ‘ఈ విజయం పట్ల ఎంతో గర్వంగా ఉంది. భావాలను వ్యక్తం చేసేందుకు మాటలు రావడం లేదు. ఇదొక అద్భుత భావన. ఎన్నో ఏళ్లుగా మేం పడిన కష్టానికి ప్రతిఫలం ఇది.’ అని అంది. ఇక ఈ మెగాటోర్నీ ఆరంభంలో తాము కొన్ని తప్పులను చేశామంది. అయితే.. వాటిని నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి విజయాల బాట పట్టినట్లుగా చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకురాకుండా ముందుగానే ముగించాలని భావించామని, అయితే.. అలా తొందరపడకుండా ప్రణాళికలను పక్కగా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నామని హర్మన్ తెలిపింది.
టైటిల్ గెలిచి కానుకగా ఇస్తాం..
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ పై హర్మన్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె జట్టు క్షేమం కోరే వ్యక్తి అని చెప్పింది. పక్కా క్యాలిక్యులేషన్‌తో ఆడుతుందని తెలిపింది. ఈ రోజు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎప్పుడూ ఆస్వాదిస్తానని అంది. ‘ఐదు రన్స్ వచ్చాయి. ఇంకో రెండు బంతులు ఉన్నాయి అంటూ ప్రతీది చెబుతూ ఉంటుంది. ఆమె ఆలోచన విధానం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ గెలుపు క్రెడిట్ ఖచ్చితంగా ఆమెదే.’ అని హర్మన్ అంది.
ఇక సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడటం ఎంతో ప్రత్యేకమని, గెలిచినా, ఓడినా ప్రేక్షకులు అండగా నిలిచారంది. అందుకనే వారికి ఈ ప్రపంచకప్ ను బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Oh, captain, our captain! 🥹🫡🇮🇳#HarmanpreetKaur‘s heartfelt speech post the semi-finals triumph against Australia! 👏🏻
WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/TDgCwiYmk8
— Star Sports (@StarSportsIndia) October 30, 2025
ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్ (127నాటౌట్; 134 బంతుల్లో 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని జెమీమా, హర్మన్ ప్రీత్ జోడీ నెలకొల్పింది.






