Jemimah Rodrigues : ఏడవని రోజంటూ లేదు.. ఆయన వల్లే ఈ గెలుపు.. కన్నీళ్లు పెట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తరువాత మాట్లాడుతూ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కన్నీళ్లు పెట్టుకుంది.
 
                            Womens World Cup 2025 Jemimah Rodrigues comments after india beat australia
Jemimah Rodrigues : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సంచలన ఇచ్చింగ్స్ ఆడింది. కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించింది. ఎలీస్ పెర్రీ (77), ఆష్లీ గార్డనర్ (63) హాఫ్ సెంచరీలు చేశారు. బెత్ మూనీ (24) రాణించింది. భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ (89: 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. జెమీమా, హర్మన్ ప్రీత్‌లు మూడో వికెట్‌కు 167 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తరువాత మాట్లాడుతూ జెమీమా కన్నీళ్లు పెట్టుకుంది. దేవుడి దయ లేకుంటే ఇది సాధ్యం అయ్యేది కాదని అంది. తనకు అండగా నిలిచిన అమ్మ, నాన్న, కోచ్‌తో పాటు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది.
#JemimahRodrigues, take a bow! 🙌#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/2Ov9ixC7Ai
— Star Sports (@StarSportsIndia) October 30, 2025
గత నెల తనకు ఎంతో కష్టంగా గడిచినట్లు చెప్పుకొచ్చింది. ఈ ఇన్నింగ్స్ ఓ కలలా అనిపిస్తోందని తెలిపింది. ఇక ఈ మ్యాచ్‌లో తాను మూడో స్థానంలో ఆడతానని ముందుగా తనకు తెలియదని చెప్పింది.
‘ఓ ఐదు నిమిషాల ముందు మాత్రమే నాకు ఈ విషయం చెప్పారు. నా కోసం కాకుండా జట్టు కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకున్నాను. ఎలాగైనా జట్టును గెలిపించాలని అనుకున్నాం. గతంలో భారత్ ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అందుకనే ఈ సారి అలా జరగకూడదని భావించాను. అందుకనే అర్థశతకం, శతకం గురించి ఆలోచించలేదు. ఈ క్రమంలోనే సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు.’ అని జెమీమా అంది.
ఆ సమయంలో రోజూ ఏడ్చాను..
తాను మంచి ఫామ్‌లో ఉన్నప్పటికి కూడా గత ప్రపంచకప్‌లో తనకు చోటు దక్కలేదని జెమీమా చెప్పింది. ఆ సమయంలో తాను ఎంతో మానసిక వేధనను గురైనట్లు వెల్లడించింది. దాదాపు ప్రతి రోజు ఏడుస్తూ కూర్చున్నట్లుగా తెలిపింది. మరింతగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చానంది.
ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా.. చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. దేవుడే తనకోసం నిలబడినట్లుగా అనిపించిందని తెలిపింది. ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు తనలో తానే ఎక్కువగా మాట్లాడుకున్నానని అంది. ఇక భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయానంది.
ఈ విజయం క్రెడిట్ తన ఒక్కదానిదే కాదని సమిష్టి విజయం అని జెమీమా రోడ్రిగ్స్ అంది. ప్రేక్షకుల మద్దతు, అరుపులు తనను మరింతగా ఉత్సాహపరిచాయంది.






