IND W vs AUS W : అందుకే ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుకుంటే ఫలితం మరోలా.. కన్నీటి పర్యంతమైన ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా తాము ఈ మ్యాచ్‌లో (IND W vs AUS W) ఓటమి పాలు అయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది.
 
                            Womens World Cup 2025 Alyssa Healy comments after australia lost match to india
IND W vs AUS W : ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ షాకిచ్చింది. నవీ ముంబై వేదికగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా తాము ఈ మ్యాచ్‌లో ఓటమి పాలు అయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది.
ఈ టోర్నీమెంట్‌లో ఓటమే ఎరుగకుండా సెమీ ఫైనల్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా కీలక సెమీస్ మ్యాచ్‌లో మాత్రం గెలవలేకపోయింది. ఈ ఓటమి పై మ్యాచ్ అనంతరం అలీసా హీలీ స్పందించింది. కీలక క్యాచ్‌లను వదిలివేయడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని తెలిపింది.
‘ఇదొక మంచి మ్యాచ్. చేజేతులా విజయాన్ని దూరం చేసుకున్నాం. బ్యాటింగ్‌లో సరిగ్గా ముగించలేకపోయాం. బౌలింగ్‌లో గొప్పగా రాణించలేదు. ఇక ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలి వేశాం. వీటి వల్లే ఓడిపోయాం. 339 పరుగుల భారీ లక్ష్యం సరిపోతుందని భావించాం.’ అని అలీసా హీలీ తెలిపింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 34వ ఓవర్‌లో 2 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఈ దశలో ఈజీగా 350 కంటే ఎక్కువ పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే.. భారత బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఇక ఫీల్డింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమిమా రోడ్రిగ్స్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలివేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జెమిమా 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపింది.
IND A vs SA A : రిషబ్ పంత్ నాయకత్వంలో చమటోడ్చిన భారత బౌలర్లు.. ముగిసిన తొలి రోజు ఆట..
వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడను..
ఇక 119 పరుగులు చేసిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను అలీసా ప్రత్యేకంగా అభినందించింది. ‘ఓ సారథిగా తరువాతి తరం ఆటగాళ్ల ప్రతిభ చూడడం బాగుంది. లిచ్ ఫీల్డ్ అద్భుతంగా ఆడింది. ఆమెకు అభినందనలు. వచ్చే ప్రపంచకప్ వరకు ఆమె ఆటను చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి.’ అని అంది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఒత్తిడికి గురి చేయడంతో పాటు విజయవకాశాలను సృష్టించుకున్నామని, అయితే.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పింది. ఇందుకు తాను కూడా ఓ కారణమేనని చెప్పింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పింది. బలంగా తిరిగి వస్తామంది. సెమీస్ మ్యాచ్ అనేది నాకౌట్ గేమ్ అని ఇందులో సరిగ్గా ఆడకపోతే ఎంత మేటి జట్టు అయినా పరాజయం పాలు అవుతుందని తెలిపింది. ఇక ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించినా కూడా గర్వపడే ప్రదర్శన చేసినట్లుగా తెలిపింది. ఇక తాను వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడనని తెలిపింది.
జెమిమా ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను అలీసా హీలీ వదిలివేసింది.






