Maharaja T20 Trophy game with three Super Overs sets record
Maharaja T20 Trophy-Super Overs : ఒకటి కాదు రెండు కాదు మూడు సూపర్ ఓవర్లు.. అవును మీరు సరిగ్గానే చదివారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో ఇది చోటు చేసుకుంది. బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే మూడు సూపర్ ఓవర్ల తరువాత ఫలితం తేలిన మ్యాచ్‌గా నిలిచింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఓ మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లే జరిగాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇది చోటు చేసుకుంది.
శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు బాస్టర్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 164 పరుగులే చేసింది. ఆఖరి బంతికి బ్యాటర్ రనౌట్ కావడంతో మ్యాచ్ స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
మొదటి సూపర్ ఓవర్‌లో బెంగళూరు బాస్టర్స్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (0) డకౌట్ కాగా.. అనిరుధ్ జోషి 8 పరుగులతో రాణించాడు. అనంతరం హుబ్లీ టైగర్స్ కూడా 10 పరుగులే చేసింది. దీంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. రెండో సూపర్ ఓవర్‌లో హుబ్లీ టైగర్స్ 8 పరుగులు చేయగా బెంగళూరు బ్లాస్టర్స్ కూడా సరిగ్గా 8 పరుగులే చేసింది. దీంతో మరోసారి స్కోర్లు సమం అయ్యాయి.
దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి మూడో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. అయితే.. హుబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులకు తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది.
DRAMA OF HIGHEST QUALITY….!!!
– 3 Super Overs in a single T20 match in the Maharaja T20 Trophy. ?⚡ pic.twitter.com/Xpb7BGNmEw
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024