WI vs SA : ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. ఇది డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ కాదు భ‌య్యా..

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ 2024లో వ‌రుస విజ‌యాల‌తో ద‌క్షిణాఫ్రికా సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

West Indies vs South Africa : పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ 2024లో వ‌రుస విజ‌యాల‌తో ద‌క్షిణాఫ్రికా సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. సోమ‌వారం వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఇద్ద‌రు ఆట‌గాళ్లకు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఓ క్యాచ్ అందుకునే క్ర‌మంలో ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ఒక‌రినొక‌రు ఢీ కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో కైల్ మేయ‌ర్స్ స్ట్రెయిట్‌గా భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న పేస‌ర్ క‌గిసో ర‌బాడ బంతిని అందుకునేందుకు పెరిగెత్తుకుంటూ రాగా.. లాంగ్ ఆప్‌లో ఉన్న పేస‌ర్ మార్కో జాన్సెన్ కూడా బంతి వైపు వ‌చ్చాడు. వీరిద్ద‌రు గాల్లో ఉన్న బంతిని చూసుకుంటూ చాలా వేగంగా ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు.

ఆస్ట్రేలియాపై విజయంతో అఫ్గాన్ ప్లేయర్ల సంబరాలు చూశారా.. వీడియో వైరల్

బంతి బౌండ‌రీ లైన్ అవ‌త‌ల ప‌డింది. అయితే.. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రు ఒక‌రినొక‌రు ఢీ కొన్నారు. ఇద్ద‌రు ఆట‌గాళ్లు కూడా నొప్పితో అక్క‌డే విల‌విల లాడారు. వెంట‌నే వైద్య బృందం మైదానంలోకి వ‌చ్చింది. ర‌బాడ కాస్త స్వ‌ల్పంగానే గాయ‌ప‌డ‌గా.. జాన్సెన్ కు మాత్రం వైద్య స‌హాయం అవ‌స‌రమైంది. కాసేప‌టి త‌రువాత ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఫిట్‌గా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు వీరిద్ద‌రు ఫీల్డింగ్ సైతం చేశారు. కాగా.. ఆ బాల్ సిక్స్‌గా వెళ్లింది.

ఇక వెస్టిండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. రోస్ట‌న్ ఛేజ్ (42 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీ బాదాడు. కైల్ మేయ‌ర్స్ (34 బంతుల్లో 35) రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో విండీస్ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితమైంది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో షంషి మూడు వికెట్లు తీశాడు. మార్కో జన్సెన్‌, మార్క్రమ్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్‌షాక్‌.. అలా జరిగితే సెమీస్ ఆశలు గల్లంతేనా?

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో సౌతాఫ్రికా 15/2 (2 ఓవర్లలో) వ‌ద్ద ఉండ‌గా వ‌ర్షం వ‌చ్చింది. వ‌రుణుడు తెరిపినిచ్చాక డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ద‌క్షిణాఫ్రికా విజ‌య స‌మీక‌ర‌ణం 17 ఓవ‌ర్ల‌లో 123 గా నిర్ణ‌యించారు. మార్‌క్ర‌మ్ (18), ట్రిస‌న్ స్ట‌బ్స్ (29), హెన్రిచ్ క్లాసెన్ (22) రాణించిన‌ప్ప‌టికీ విండీస్ బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీయ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌కు దారి తీసింది. అయితే.. ఆఖ‌ర్లో మార్కోజాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్‌), క‌గిసో ర‌బాడ (3 బంతుల్లో 5 నాటౌట్‌) జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు