Mitchell Starc : ఒకే ఒక్కడు.. వన్డేల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వరల్డ్ రికార్డ్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ ఘనత సాధించాడు.

Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ ఘనత సాధించాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో రియాన్ బర్ల్ వికెట్ పడగొట్టిన స్టార్క్.. తన వన్డే కెరీర్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. దీంతో వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ పేరిట ఉంది. 104 మ్యాచుల్లో ఈ రికార్డును అతడు సాధించాడు. తాజాగా ఆసీస్ బౌలర్ స్టార్క్ కేవలం 102 మ్యాచుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. దీంతో ముస్తాక్ రికార్డు బద్దలైంది.
మొత్తంగా 200 వికెట్లు తీసిన వారిలో స్టార్క్ టాప్‌లో ఉన్నాడు. రెండు, మూడు స్థానాల్లో సక్లైన్ ముస్తాక్, ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ ఉన్నారు. బ్రెట్‌లీ 112 మ్యాచుల్లో 200 వికెట్లు తీశాడు. మరోవైపు వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన పేసర్‌గా స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా, మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జింబాబ్వే గెలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 31 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వార్నర్ 94 పరుగులతో అలరించాడు. మాక్స్‌వెల్ 19 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు అంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్ 5 వికెట్లు తీయగా.. ఈవన్స్ రెండు, నగారవ, యాంచి, విలియమ్స్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో టార్గెట్‌ను చేధించింది. 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఛకబ్వా 37, మరుమణి 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 3 వికెట్లు తీశాడు. సార్ట్క్, గ్రీన్, స్టోయినిస్, ఆగర్ తలో వికెట్ పడగొట్టారు.