IPL : ఇదీ అసలు కారణం.. ఇన్నాళ్లకు బయటపెట్టారు.. సిరాజ్ ని వదిలేయడానికి కారణం చెప్పిన ఆర్సీబీ..
ఐపీఎల్ (IPL)లో సిరాజ్ 2017 నుండి ఆర్‌సీబీ బౌలింగ్ దాడిలో కీలక పాత్ర పోషించాడు. 102 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు.

IPL RCB finally reveals why they let go of Mohammed Siraj
IPL : ఐపీఎల్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. 17 ప్రయత్నాల తరువాత 18వ ప్రయత్నంలో విజేతగా నిలిచింది. ఐపీఎల్ (IPL)2025 సీజన్‌లో ఆర్‌సీబీ కప్పును ముద్దాడింది.
కాగా.. ఈ సీజన్ కన్నా ముందు జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సహా అనేక మంది స్టార్ ఆటగాళ్లను వదులుకుంది.
ఈ చర్య చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సిరాజ్ 2017 నుండి ఆర్‌సీబీ బౌలింగ్ దాడిలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. సిరాజ్‌ను వదులుకోవడం పై ఎట్టకేలకు ఆర్‌సిబి క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పందించాడు. క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ.. సిరాజ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు విడుదల చేయడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలున్నాయని, దీనికి సంబంధించి చాలా ఆలోచించామని తెలిపారు.
జట్టు ప్రాథమిక లక్ష్యం అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకోవడం అని చెప్పుకొచ్చాడు. ఆరంభ, డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ నైపుణ్యం అసాధారణం అని అన్నాడు. ఇక సిరాజ్‌ను అట్టిపెట్టుకుని ఉంటే.. భువీని సొంతం చేసుకునే అవకాశాలు పరిమితం అయ్యేవని అన్నాడు.
టీమ్ఇండియా పేసర్లను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకనే సిరాజ్‌ను నిలుపుకోవాలా, విడుదల చేయాలా, లేదా రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా అనే ప్రతి దాని గురించి సుదీర్ఘంగా చర్చినట్లు వెల్లడించాడు. ఇది అంత సులభంగా తీసుకున్న నిర్ణయం కాదు.. జట్టు భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించి తీసుకున్నాం అని మో బోబాట్ అన్నాడు.
BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కామెంట్స్..
ఆర్‌సీబీ తరుపున సిరాజ్ 102 మ్యాచ్‌లు ఆడాడు 99 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగావేలంలో ఆర్‌సీబీ భువనేశ్వర్ కుమార్‌ను 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు దక్కించుకుంది. ఇక వేలంలోకి వచ్చిన సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.25 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ ఆర్‌సీబీ తరుపున మంచి ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు సిరాజ్ కూడా గుజరాత్ తరుపున రాణించాడు. 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించాడు.