MLC 2025 MI New York won by 2 wickets against San Francisco Unicorns in Eliminator
మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. గురువారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, ఎంఐ న్యూయార్క్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌలైంది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో జేవియర్ బార్ట్‌లెట్ (44) రాణించగా కూపర్ కొనొల్లీ (23), బ్రాడీ కౌచ్ (19) పర్వాలేదనిపించారు. ఎంఐ బౌలర్లలో రుషిల్ ఉగార్కర్ మూడు వికట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, నోస్తుష్ కెంజిగే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మోనాంక్ పటేల్ (33), క్వింటన్ డికాక్ (33) లు తొలి వికెట్ కు 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే.. నికోలస్ పూరన్ (1), కీరన్ పొలార్డ్ (5), తాజిందర్ ధిల్లాన్ (4), హీత్ రిచర్డ్స్ (0) లు విఫలం కాగా.. మైకెల్ బ్రాస్‌వెల్ (18) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఎంఐ జట్టు 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దీంతో ముంబై కు ఓటమి తప్పదని అంతా భావించారు. అయితే.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్ బ్యాటింగ్‌లో చెలరేగాడు. కేవలం 13 బంతుల్లో 2 సిక్సర్లు బాది 22 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు నమ్మశక్యంగాని విజయాన్ని అందించాడు. 19.3 ఓవర్లలో ఎంఐ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో హసన్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా, మాథ్యూ షార్ట్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో శాన్ ఫ్రాన్సిస్కో లీగ్ నుంచి నిష్ర్కమించింది.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. టీమ్ఇండియా బౌలింగ్ కాంబినేషన్ పై రిషబ్ పంత్ హింట్..
ఇక ఎంఐ న్యూయార్క్ జట్టు జూలై 12న టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఛాలెంజర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.