Mohammed Shami
Shami : మంచి వేగం, బౌలింగ్‌లో కచ్చితత్వం, అనుభవం.. అన్నీ ఉన్నా సరే సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. అయితే రాక రాక వచ్చిన అవకాశాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన షమీ ఐదు వికెట్ల తీసి తనెంత విలువైన ఆటగాడినో తన ప్రదర్శనతోనే చాటి చెప్పాడు.
అయితే.. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అతడిని పక్కన బెట్టనున్నారని వార్తల వచ్చాయి. అక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని, దీంతో షమీని పక్కన బెట్టి అశ్విన్‌ను ఆడిస్తారని అంచనా వేశారు. అయితే.. రోహిత్ మాత్రం షమీకే ఓటు వేయడంతో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు నడ్డి విరిచాడు. మొత్తంగా ఈ ప్రపంచకప్‌లో రెండు మ్యాచులు మాత్రమే ఆడిన షమీ తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటారు.
Virat Kohli : కోహ్లీ కోసం ఈడెన్ గార్డెన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న క్యాబ్.. ఎందుకో తెలుసా..?
అరుదైన రికార్డుకు చేరువలో..
కాగా.. మహ్మద్ షమీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీమ్ఇండియా తరుపున వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు షమీకి మరో నాలుగు వికెట్లు మాత్రమే అవసరం. ఈ జాబితాలో జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 23 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత జవగళ్ శ్రీనాథ్ సైతం 44 వికెట్లు తీశాడు. అయితే.. శ్రీనాథ్ ఈ వికెట్లు తీసేందుకు 33 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి.
వీరిద్దరి తరువాతి స్థానంలో షమీ ఉన్నాడు. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే షమీ 40 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్ చూస్తుంటే రానున్న ఒకటి లేదా రెండు మ్యాచుల్లో ఈ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంకొక్క రెండు వికెట్లు తీస్తే..
ఓవరాల్‌గా.. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ 11వ స్థానంలో ఉన్నాడు. షమీ కనుక ఇంకో రెండు వికెట్లు పడగొడితే బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను అధిగమిస్తాడు. షకీబ్ 34 ఇన్నింగ్స్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి.. భారత స్పీడ్‌స్టర్ జాబితాలోని టాప్ 30 బౌలర్లలో పోలిస్తే అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు.