Mohsin Naqvi : ఆసియాక‌ప్ నుంచి మేం ఎందుకు వైదొల‌గ‌లేదు అంటే.. పీసీబీ చీఫ్ నఖ్వి చెప్పిన సాకులు ఇవే..

టోర్నీని బ‌హిష్క‌రించ‌కుండా కొన‌సాగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) వెల్ల‌డించారు.

Mohsin Naqvi Explains Why Pakistan Did Not Pull Out of Asia Cup 2025

Mohsin Naqvi : బుధ‌వారం పాక్‌, యూఏఈ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కు ముందు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పీసీబీ డిమాండ్‌కు ఐసీసీ అంగీక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్‌ సిద్ధమైనట్లు వార్తలు వ‌చ్చాయి.

నిర్ణీత స‌మ‌యానికి పాక్ ఆట‌గాళ్లు హోట‌ల్ నుంచి బ‌య‌లుదేర‌క‌పోవ‌డంతో ఓ ద‌శ‌లో మ్యాచ్ జ‌రుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. చివ‌రికి రిఫ‌రీ పైక్రాఫ్ట్ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు పీసీబీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో పాక్ ఆట‌గాళ్లు మైదానానికి వెళ్లారు. ఈ క్ర‌మంలో మ్యాచ్ నిర్ణీత స‌మ‌యం కంటే గంట ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది.

టోర్నీలో ఎందుకు కొన‌సాగుతున్నామంటే?

టోర్నీని బ‌హిష్క‌రించ‌కుండా కొన‌సాగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ‘అంద‌రికి తెలిసిన‌ట్లుగానే సెప్టెంబ‌ర్ 14 నుంచి సంక్షోభం కొన‌సాగుతోంది. మ్యాచ్ రిఫ‌రీ పాత్ర‌పై మేం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశాము. అయితే.. ఆయ‌న యూఏఈతో మ్యాచ్‌కు కాసేప‌టి ముందు మా టీమ్ కోచ్‌, కెప్టెన్, మేనేజ‌ర్‌తో మాట్లాడారు.’ అని న‌ఖ్వి తెలిపాడు.

Asia Cup 2025 : యూఏఈ పై పాక్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ భార‌త్‌, పాక్ పోరు.. ఎప్పుడో తెలుసా?

ఈ సంఘటన (కరచాలన ఘ‌ట‌న‌) జ‌రిగి ఉండాల్సింది కాద‌ని రిఫ‌రీ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు న‌ఖ్వి చెప్పాడు. మ్యాచ్ స‌మ‌యంలో కోడ్ ఉల్లంఘ‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఐసీసీని కోరిన‌ట్లు తెలిపాడు. ఇక క్రీడ‌లు, రాజ‌కీయాలు ఎప్ప‌టికి ఒక‌టి కాద‌ని తాము న‌మ్ముతామ‌న్నాడు. ఇది క్రీడ‌, దీనిని ఇలాగే చూడాల‌న్నాడు. ఒక‌వేళ తాము ఆసియాక‌ప్‌ను బ‌హిష్క‌రించాల‌ని అనుకుంటే అది చాలా పెద్ద నిర్ణ‌యం అవుతుంద‌న్నాడు.

ప్రధానమంత్రి, ప్రభుత్వ అధికారులు, అనేక మంది ఇతర వ్యక్తులు మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని, అయిన‌ప్ప‌టికి కూడా తాము అలా చేయ‌డం లేద‌న్నాడు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంపైనే దృష్టిపెట్టిన‌ట్లు వెల్ల‌డించాడు.

బ‌హిష్క‌రిస్తే తీవ్ర న‌ష్టం..!

వాస్త‌వానికి ఆసియాక‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే.. వారికి వ‌చ్చే ఆదాయం రాదు. అదే జ‌రిగితే పీసీబీకీ ఆర్థికంగా తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది. వంద కోట్ల‌కు పైగా ఆదాయాన్ని పీసీబీ కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే పీసీబీ బ‌హిష్క‌ర‌ణ‌పై వెన‌క్కి త‌గ్గింద‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. ఆస్ట్రేలియా పై ఫాస్టెస్ట్ సెంచ‌రీ..

ఇదిలా ఉంటే.. యూఏఈతో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాక్ విజ‌యం సాధించింది. సూప‌ర్‌4కి అర్హ‌త సాధించింది. ఇక సూపర్‌4లో భాగంగా భార‌త్‌, పాక్ జ‌ట్లు ఆదివారం (సెప్టెంబ‌ర్ 21న‌) మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి.