IPL 2024 : రావడం ఆలస్యమైనా రచ్చచేయడం మాత్రం కామన్.. విశాఖలో ధోనీ బౌండరీల మోత.. వీడియో చూడండి

మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే అవకాశాలు ఉండేవి.

IPL 2024 : రావడం ఆలస్యమైనా రచ్చచేయడం మాత్రం కామన్.. విశాఖలో ధోనీ బౌండరీల మోత.. వీడియో చూడండి

MS Dhoni

MS Dhoni : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. వార్నర్ (52), పంత్ (51), పృథ్వీ షా(43) రాణించారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే జట్టు బ్యాటర్లు తడబడ్డారు. ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. ఆ తరువాత రహానె పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 45 వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. చివరిలోవచ్చిన ధోనీ సిక్సర్ల మోతమోగించాడు.

Also Read : GT vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయ దుందుభి

మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు క్రీజులో్కి వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వచ్చారు. సీఎస్కే జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్న క్రమంలో ధోనీధోనీ అంటూ స్టేడియం దద్దరిల్లిపోయింది. 8వ స్థానంలో ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. ధోనీ క్రీజులోకి వచ్చే సమయానికి మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ధోనీ క్రీజులోకి వచ్చీరాగానే సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ధోనీ సిక్స్, ఫోర్ కొట్టినప్పుడల్లా స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. జడేజాతో కలిసి ఢిల్లీ బౌలర్లను కొద్దిసేపు ధోనీ భయపెట్టాడు. మొత్తం 16 బంతులు ఆడిన ధోనీ నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 37 పరుగులు చేసి నాటౌట్ గా ధోనీ నిలిచాడు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై జట్టు ఆరు వికెట్లు కోల్పోయొ 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్కే జట్టు 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదిరే ఆటతీరుతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్లో ఢిల్లీ తొలి ఓటమి రుచి చూపించింది.

Also Read : IPL 2024 సీజ‌న్‌లో అత్యంత వేగవంతమైన బంతి.. బ్యాట్ పైకెత్తేలోపు దూసుకెళ్లింది..! వీడియో వైరల్

మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ, ధోనీకి చివరి సీజన్ అనే ప్రచారం నేపథ్యంలో ఆఖరి సారిగా అతని మెరుపులు చూడాలన్న అభిమానుల కోరిక ఇప్పటికైతే ఇలా నెరవేరింది.