MS Dhoni training youngsters at the JSCA International Cricket Stadium
MS Dhoni : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత నుంచి ప్రతి ఏడాది ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడో లేదో అన్న సందేహాలు రావడం, వాటిని పటాపంచలు చేస్తూ అతడు లీగ్‌లో ఆడడం మామూలు అయిపోయింది. ఇక ఐపీఎల్ 2026లో ధోని ఆడడం ఖాయమేనని తెలుస్తోంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ అతి త్వరలోనే బీసీసీఐ వెల్లడించింది.
కాగా.. టోర్నీకి రెండు నెలల సమయం ఉన్నప్పటికి కూడా ధోని సన్నాహకాలను ప్రారంభించాడు. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే సమయంలో పలువురు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ షేర్ చేసింది.
2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కాగా.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అతడి సారథ్యంలో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇటీవల ఆ జట్టు సారథ్య బాధ్యలను రుతురాజ్ గైక్వాడ్ స్వీకరించాడు.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి రాలేదు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడితే నాలుగు అంటే నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. దీంతో వరుసగా రెండో ఏడాది ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు దూరమైంది.
ఈ సీజన్‌లో గాయం కారణంగా గైక్వాడ్ జట్టుకు దూరమైన తర్వాత ధోని తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. కెప్టెన్‌గా విఫలమైనా కూడా ధోని 13 ఇన్నింగ్స్‌లలో 24.50 సగటుతో 135.17 స్ట్రైక్‌రేటుతో 196 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2026 కోసం వేలంలో చెన్నై జట్టు ప్రశాంత్ వీర్ , కార్తీక్ శర్మ వంటి యువ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆ జట్టు బలంగా తిరిగి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.