Muhammad Waseem Comments after United Arab Emirates lost to Pakistan in Asia Cup 2025
Muhammad Waseem : ఆసియాకప్ 2025లో సూపర్4కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూఏఈ ఓడిపోయింది. బుధవారం దుబాయ్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యూఏఈ ఆసియాకప్ 2025 నుంచి నిష్ర్కమించింది. తమ జట్టు ఓటమికి బ్యాటర్లు విఫలం కావడమే ప్రధాన కారణం అని యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం (Muhammad Waseem) తెలిపాడు. బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
మ్యాచ్ అనంతరం ముహమ్మద్ వసీం మాట్లాడుతూ.. ‘మా బౌలర్లకు నేను క్రెడిట్ ఇస్తాను. పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. బ్యాటింగ్‌లో విఫలం కావడం వల్లే మ్యాచ్‌ను కోల్పోయాం. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికి పుంజుకున్నాం. ఇక 15 ఓవర్ తరువాత త్వరగా వికెట్లను కోల్పోయాము. మిడిల్ ఆర్డర్ ఇంకాస్త బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంది.’ అని అన్నాడు.
ఈ టోర్నమెంట్‌లో యూఏఈ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒమన్ పై మాత్రమే గెలిచింది. భారత్, పాక్ చేతుల్లో ఓడిపోయింది. ఈటోర్నమెంట్ గురించి వసీం మాట్లాడుతూ.. ఈ టోర్నీ తమకు మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నాడు. భారత్, పాక్ వంటి జట్లతో ఆడే అవకాశం లభించిందన్నాడు. తద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ అనుభవాల ద్వారా రాబోయే టోర్నీల్లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తామన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఫకార్ జమాన్(50), షాహిన్ షా అఫ్రిది(29 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ నాలుగు, సిమ్రంజిత్ సింగ్ మూడు వికెట్లు తీశారు. ధ్రువ్ పరాషర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాషర్ (20)లు రాణించినా మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.