IPL 2023, SRH vs MI: ఉప్ప‌ల్‌లో అద‌ర‌గొట్టిన రోహిత్ సేన‌.. హ్యాట్రిక్ విజ‌యాలు

ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 193 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19.5 ఓవ‌ర్ల‌లో 178 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

Mumbai Indians

IPL 2023, SRH vs MI: ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్( Mumbai Indians) 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 193 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19.5 ఓవ‌ర్ల‌లో 178 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. గ‌త మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన హ్యారీ బ్రూక్ 9 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో 11 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన త్రిపాఠి రెండు ఫోర్లు కొట్టి ట‌చ్‌లో ఉన్న‌ట్లు క‌నిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయాడు. ఇషాన్ కిష‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో 25 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది స‌న్‌రైజ‌ర్స్‌. తొలి రెండు వికెట్ల‌ను బెహ్రెన్ డార్ఫ్ తీశాడు. ఈ ద‌శ‌లో మార్‌క్ర‌మ్‌(22), మ‌యాంక్ అగ‌ర్వాల్‌(48)లు కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు.

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న వీరి జోడిని కామెరూన్ గ్రీన్ విడ‌గొట్టాడు. కెప్టెన్ మార్‌క్ర‌మ్‌ను పెవిలియ‌న్‌కు పంపించాడు. ఆ వెంట‌నే పీయూష్ చావ్లా బౌలింగ్‌లో అభిషేక్ శ‌ర్మ‌(1) ఔట్ కావ‌డంతో 72 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి స‌న్‌రైజ‌ర్స్ క‌ష్టాల్లో ప‌డింది. కాసేపు దూకుడుగా ఆడిన క్లాసెన్(36; 16 బంతుల్లో4 ఫోర్లు 2సిక్స్‌) అభిమానుల్లో ఆశ‌లు రేపాడు. అయితే.. క్లాసెన్‌తో పాటు మ‌యాంక్‌లు వ‌రుస‌ ఓవ‌ర్ల‌లో ఔట్ కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి దిశ‌గా సాగింది. చివ‌రికి 19.5 ఓవ‌ర‌ల్లో 178 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ల‌లో జాసన్ బెహ్రెన్ డార్ఫ్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లాలు త‌లా రెండు వికెట్లు తీయ‌గా కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్క‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023, SRH vs MI: స‌న్‌రైజ‌ర్స్‌పై ముంబై గెలుపు

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ(28), ఇషాన్ కిష‌న్‌(38)లు శుభారంభం ఇచ్చారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఐపీఎల్‌లో 6 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్ర‌మంలో న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన రోహిత్‌.. మార్‌క్ర‌మ్ చేతికి చిక్కాడు. దీంతో ముంబై జ‌ట్టు 41 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఇషాన్ కిష‌న్‌కు కామెరూన్ గ్రీన్(64 నాటౌట్; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స‌ర్లు) జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 46 ప‌రుగులు జోడించారు.

ఈ ద‌శ‌లో మార్కో జాన్సెన్ ముంబై ని గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. ఇషాన్ కిష‌న్‌తో పాటు సూర్య‌కుమార్‌(6) యాద‌వ్‌ను ఒకే ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో 95 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన ముంబై క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. గ్రీన్‌కు లోక‌ల్ బాయ్ తిల‌క్ వ‌ర్మ‌(37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్స‌ర్లు) జ‌త‌క‌లిశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌పై తిల‌క్ ఎదురుదాడికి దిగాడు. ఉన్నంత సేపు బౌండ‌రీల మోత మోగించాడు. నాలుగో వికెట్ కు 56 ప‌రుగులు జోడించాక జ‌ట్టు స్కోరు 151 వ‌ద్ద తిల‌క్ వ‌ర్మ ను భువ‌నేశ్వ‌ర్ బోల్తా కొట్టించాడు. ధాటిగా ఆడిన కామెరూన్ గ్రీన్‌ 33 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధ‌శ‌త‌కాన్ని సాధించాడు. గ్రీన్ విజృంభ‌ణ కార‌ణంగా ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయ‌గా, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023, SRH vs MI: హ్యాట్రిక్ ఎవ‌రిదో..? ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌దే పై చేయి.. హెడ్ టూ హెడ్ రికార్డు మాత్రం