IPL 2023, SRH vs MI: హ్యాట్రిక్ ఎవ‌రిదో..? ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌దే పై చేయి.. హెడ్ టూ హెడ్ రికార్డు మాత్రం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా నేడు ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

IPL 2023, SRH vs MI: హ్యాట్రిక్ ఎవ‌రిదో..? ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌దే పై చేయి.. హెడ్ టూ హెడ్ రికార్డు మాత్రం

SRH vs MI

Updated On : April 18, 2023 / 4:25 PM IST

IPL 2023 SRH vs MI: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా నేడు ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians), స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు దాదాపు ఒకే విధంగా ఆడుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో రెండు జ‌ట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెల‌వ‌గా మ‌రో రెండు మ్యాచుల్లో ఓడిపోయాయి. రెండు జ‌ట్లు ఈ సీజ‌న్‌లోని తొలి రెండు మ్యాచుల‌ను ఓడిపోగా.. చివ‌రి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో నేడు ఉప్ప‌ల్‌లో ఎవ‌రు హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, రోహిత్ శ‌ర్మ‌, టిమ్ డేవిడ్, తిల‌క్ వ‌ర్మ‌ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌తో కూడిన ముంబై బ్యాటింగ్ విభాగం చాలా బ‌లంగా క‌నిపిస్తోంది. ఇక వీరంద‌రూ ఫామ్‌లో ఉండ‌డం ముంబైకు క‌లిసి వ‌చ్చే అంశం. వీరిలో ఏ ఇద్ద‌రు చెల‌రేగినా భారీ స్కోరు సాధించ‌డం ఖాయం. అయితే.. ముంబైను ఇబ్బంది ప‌ట్టే అంశం ఏదైనా ఉంది అంటే అది బౌలింగ్ మాత్రమే. గాయం కార‌ణంగా బుమ్రా దూరం ఆట‌కు దూరంగా ఉండ‌డం, కోట్లు పెట్టి కొనుకున్న ఇంగ్లాండ్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ఫిట్‌గా లేక‌పోవ‌డం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బ‌. ఉన్న‌వారిలో ఒక్క పీయూష్ చావ్లా మిన‌హా మిగిలిన వారు ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌డం లేదు. వికెట్లు తీసుకున్నా ధారాళంగా ప‌రుగులు ఇస్తున్నారు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ రెండు ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేసిన 17 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రో ఓవ‌ర్‌ను అర్జున్‌కు ఇచ్చేందుకు సాహ‌సించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నేటి మ్యాచులో అర్జున్ ఆడ‌తాడో లేదో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.

ఇక స‌న్‌రైజ‌ర్స్ విష‌యానికి వ‌స్తే రూ.13 కోట్లు పెట్టి కొనుకున్న హ్యారీ బ్రూక్ ఫామ్ అందుకోవ‌డం ఊర‌ట నిచ్చే అంశం. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్‌క్ర‌మ్‌, అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిక్ క్లాసెన్ లు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లు బ్యాట్ ఝుళిపిస్తే ముంబైకి క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. భువ‌నేశ్వ‌ర్ కుమార్, మార్కో జాన్సెన్‌, న‌ట‌రాజ‌న్‌, ఉమ్రాన్ మాలిక్‌, మ‌యాంక్ మార్కండే, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌తో కూడిన బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా ఉంది. ఇరు జ‌ట్ల‌ను గ‌మ‌నిస్తే స‌మానంగా ఉన్న‌ప్ప‌టికి స‌న్‌రైజ‌ర్స్ కొంత మెరుగ్గా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి గెలిచే అవ‌కాశం స‌న్‌రైజ‌ర్స్ కాస్త ఎక్కువ‌గా ఉంది.

అయితే.. హెడ్ టూ హెడ్ రికార్డు విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు ఐపీఎల్‌లో 19 సార్లు ముఖాముఖి పోరులో త‌ల‌ప‌డ‌గా ముంబై ఇండియ‌న్స్ 10 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. హైద‌రాబాద్ 9 మ్యాచుల్లో గెలిచింది. చివ‌ర‌గా ఆడిన ఐదు మ్యాచుల్లో ముంబై మూడు గెలువ‌గా, హైద‌రాబాద్ రెండింటిలో విజ‌యం సాధించింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లు త‌ల‌ప‌డ్డాయి. అందులో హైద‌రాబాద్ 4 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా, ముంబై ఇండియ‌న్స్ 3 మ్యాచుల్లో గెలిచింది.

తుది జ‌ట్ల (అంచ‌నా) :

హైద‌రాబాద్ జ‌ట్టు :

తొలుత బ్యాటింగ్ అయితే.. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

ఫీల్డింగ్ అయితే.. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

ముంబై జ‌ట్టు :

మొద‌ట బ్యాటింగ్ అయితే.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరూన్ గ్రీన్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, రిలే మెరెడిత్, డువాన్ జాన్సెన్/జాసన్ బెహ్రెండాఫ్

ఫీల్డింగ్ అయితే.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్/అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, రిలే మెరెడిత్, డువాన్ జాన్సెన్/జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.