MI Win
IPL 2023, PBKS vs MI: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. దీంతో పంజాబ్ పై ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(75; 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(66; 31 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు) దంచికొట్టారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్, రిషి ధావన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే హిట్‌మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్(23; 18 బంతుల్లో 4 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే.. పవర్ ప్లే ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్ ఔట్ కావడంతో 6 ఓవర్లకు ముంబై 54/2 తో నిలిచింది.
IPL 2023, LSG vs CSK: వరుణుడిదే ఆట.. లక్నో, చెన్నై మ్యాచ్ రద్దు.. చెరో పాయింట్
అగ్నికి వాయువు తోడు అయినట్లు ఇషాన్ కిషన్‌కు సూర్యకుమార్ యాదవ్ జత కలవడంతో ఇన్నింగ్స్ స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది. వీరిద్దరు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదారు. ఈ క్రమంలో ఇషాన్ 29, సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ తరువాత మరింత వేగం పెంచిన సూర్యకుమార్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో భారీ షాట్‌కు యత్నించి అర్షదీప్ సింగ్‌కు చేతికి చిక్కడంతో 178 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది.
ఇషాన్, సూర్యల జోడి మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 124 పరుగులు జోడించి ముంబైని విజయం దిశగా నడిపించారు. అయితే.. సూర్య ఔటైన మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ పెవిలియన్‌కు చేరడంతో కాస్త ఆందోళన మొదలైంది. కాగా.. టిమ్ డేవిడ్(19 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు) కలిసి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (26 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 7 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత్‌కు వరుస షాక్‌లు
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (82 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) జితేశ్ శర్మ(49 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. 53 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.