WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు భారత్‌కు వ‌రుస షాక్‌లు

టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. జ‌ట్టును ప్ర‌క‌టించ‌డాని క‌న్నా ముందే జ‌స్‌ప్రీత్ బుమ్రా, రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గాయాల జాబితా రోజు రోజుకు పెద్ద‌ది అవుతోంది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు భారత్‌కు వ‌రుస షాక్‌లు

India Face Injury Headache Over WTC final

WTC Final 2023: ఐసీసీ(ICC) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) ను టీమ్ఇండియా(Team India) ద‌క్కించుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. వ‌రుస‌గా రెండో ఏడాది సైతం భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంది. తొలి సారి న్యూజిలాండ్(New Zealand) చేతిలో ఓడిన భార‌త్ ఈ సారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి టైటిల్‌ను ద‌క్కించుకోవాల‌ని బావిస్తోంది. జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు మ్యాచ్ ఆడే జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

అయితే.. టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. జ‌ట్టును ప్ర‌క‌టించ‌డాని క‌న్నా ముందే జ‌స్‌ప్రీత్ బుమ్రా, రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గాయాల జాబితా రోజు రోజుకు పెద్ద‌ది అవుతోంది. ఫైన‌ల్ మ్యాచ్ కోసం జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌లో న‌లుగురు గాయాల కార‌ణంగా మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.

1. ఉమేశ్ యాద‌వ్‌

ఉమేశ్ యాద‌వ్ 2021లో ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించిన భార‌త జ‌ట్టులో స‌భ్యుడు. ఇంగ్లాండ్ కండిష‌న్స్‌ల‌లో బంతిని వేగంగా వేయ‌డంతో పాటు మంచి స్వింగ్‌ను రాబ‌ట్ట‌గ‌ల బౌల‌ర్ల‌లో ఒక‌డు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ఆడుతూ గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు ముందు గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం బుమ్రా అందుబాటులో లేక‌పోవ‌డంతో ఉమేశ్ కీల‌కం అవుతాడ‌ని బావిస్తుండ‌గా అత‌డు గాయ‌ప‌డ‌డం ఇబ్బంది క‌లిగిస్తోంది. అయితే ఈ గాయం మ‌రీ అంత తీవ్ర‌మైనది కాక‌పోవ‌చ్చున‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ నాటికి కోలుకుంటాడా అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది.

2. శార్దూల్ ఠాకూర్

ఇంగ్లాండ్ పిచ్‌ల‌పై కీల‌కం అవుతాడ‌ని బావిస్తున్న మ‌రో ఆట‌గాడు శార్దూల్ ఠాకూర్‌. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించ‌గ‌ల ఠాకూర్ తుది జ‌ట్టులో ఉంటే జ‌ట్టుకు స‌మ‌తూకం వ‌స్తుంది. అయితే.. ఐపీఎల్‌లో కోల్‌క‌తాకు ఆడుతూ గాయంతో కొన్ని మ్యాచ్‌ల‌కు దూరం అయిన ఈ ఆట‌గాడు గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆడాడు. బ్యాటింగ్‌లో మూడో స్థానంలో బ‌రిలోకి దిగి గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. అయితే.. కెప్టెన్ నితీశ్ రాణా అత‌డికి ఒక్క ఓవ‌ర్ కూడా బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అత‌డు బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ కావ‌డంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఇది ఆందోళ‌న క‌లిగించే అంశం. దీంతో అత‌డు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా అనే అనుమానాలు నెల‌కొన్నాయి.

3.జ‌య‌దేవ్ ఉనద్క‌త్‌

చాలా కాలం త‌రువాత ఇటీవ‌లే టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చాడు జ‌య‌దేవ్ ఉనద్క‌త్‌. ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆడుతున్నాడు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో కింద‌ప‌డిపోయాడు. అత‌డి భుజానికి గాయ‌మైంది. గాయానికి స్కానింగ్ నిర్వ‌హించిన అనంత‌రం ఐపీఎల్‌ సీజ‌న్ మొత్తానికి దూరం అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ వ‌ర‌కు కోలుకుంటాడా అన్న‌ది అనుమానంగా మారింది. కోలుకోక పోతే ఇంగ్లాండ్ విమానం ఎక్క‌లేడు.

4. కేఎల్ రాహుల్

మ‌రో కీల‌క ఆట‌గాడు కేఎల్ రాహుల్ సైతం గాయప‌డ్డాడు. ఐపీఎల్‌లో ల‌క్నోకు ఆడుతున్న రాహుల్ ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. అత‌డి గాయం తీవ్ర‌మైన‌దిగా తెలుస్తోంది. దీంతో ఈ సీజ‌న్ మొత్తానికి అత‌డు దూరం కానున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ల‌క్నో జ‌ట్టుతోనే ఉన్న రాహుల్ గురువారం ముంబైకి వెళ్ల‌నున్నాడు. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో అత‌డికి స్కానింగ్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాహుల్ చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బీసీసీఐ పర్యవేక్షిస్తుంది. అత‌డి గాయం క‌నుక త‌గ్గ‌కపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం కష్టమే.

ఒక వేళ వీరంతా కోలుకుని ఇంగ్లాండ్‌కు వెళ్లినా వంద శాతం ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్ ఆడ‌తారా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఉంది.

WTC 2023 ఫైనల్ కోసం భారత జట్టు ఇదే :

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.