పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..

Neeraj Chopra and PM Narendra Modi

Neeraj Chopra wins Silver Medal : ఎన్నో అంచ‌నాల‌తో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన నీర‌జ్ చోప్రా ర‌జ‌త పతకాన్ని గెలుచుకున్నాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో నీర‌జ్ స్వ‌ర్ణం గెలిచిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి అత‌డు పారిస్ ఒలింపిక్స్ లోనూ స్వ‌ర్ణం ప‌త‌కం గెలుస్తాడ‌ని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అభిమానుల అంచనాలకు తగిన విధంగా నీరజ్ చోప్రా మరోసారి గొప్ప ప్రదర్శనే చేశాడు. కానీ, ఈసారి రజత పతకానికే పరిమితం అయ్యాడు. పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఫైనల్ లో అర్షద్ 92 మీటర్ల మార్క్ ను తాకగా.. నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరాడు. దీంతో నీరజ్ కు రజత పతకం దక్కింది.

Also Read : Hockey : భారత హాకీ జట్టుపై కోట్ల వర్షం.. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని పతకాలు గెలిచిందో తెలుసా?

పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా దీనిపై మేం కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్ లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఈ రోజు పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ డే అయింది. నేను వందశాతం కష్టపడ్డా. కానీ, మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన జాతీయ గీతం వినిపించలేక పోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉందని నీరజ్ అన్నాడు. నీరజ్ తండ్రి సతీశ్ మాట్లాడుతూ.. దేశం కోసం సిల్వర్ గెలిచాడు. మేమంతా సంతోషంగా ఉన్నాం. గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో నీర‌జ్‌ చోప్రాకు ర‌జ‌తం.. ఒలింపిక్స్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన పాక్ అథ్లెట్‌

పారిస్ ఒలింపిక్స్ లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్ లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నీరజ్ చోప్రాను అభినందించారు. నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్ లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. రజత పతకం సాధించినందుకు చోప్రాకు అభినందనలు అని మోదీ పేర్కొన్నారు. నీరజ్ చోప్రా ఎంతో మంది యువ అథ్లెట్లకు ఆదర్శమని మోదీ ఎక్స్ లో ప్రశంసించారు.

 

ట్రెండింగ్ వార్తలు