Why Prasidh replaced Hardik
Why Prasidh replaced Hardik: వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో అన్నింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేస్తూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆదివారం తలపడనుంది. అయితే, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచ కప్ టోర్నీ నుంచి గాయం కారణంగా దూరమయ్యాడు. పాండ్య స్థానంలో భారత్ జట్టు మేనేజ్ మెంట్ యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ను జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణనే భారత్ జట్టులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అతని బదులుగా సంజూ శాంసన్ వంటి బ్యాటర్ ను, ఆల్ రౌండ్ విభాగంలో అక్షర్ పటేల్, దీపక్ చాహర్ వంటి వారిని తీసుకుంటే బాగుండేదని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. తాజాగా ఈ అంశంపై రాహుల్ ద్రవిడ్ స్పందించారు.
ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవటానికి ప్రధాన కారణం పేస్ బౌలింగ్ వనరులను పెంచేందుకేనని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. పదిహేను మందితో కూడిన జట్టులోనుంచి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా మైదానంలోకి దిగుతుంది. బ్యాకప్ లో స్పిన్ విభాగంలో అశ్విన్ ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్ లేదు. ఎవరైనా అనారోగ్యం బారినపడ్డా, గాయపడ్డా ఇబ్బంది ఎదురవుతుంది. అందుకోసమే బ్యాకప్ అవసరమని గుర్తించాం. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు మాకు ఉపయోగపడుతుందని ద్రవిడ్ అన్నారు.
ప్రస్తుతం టీమిండియాలో ముగ్గురు పాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, అహ్మద్ షమీలు అదరగొడుతున్నారు. హార్దిక్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ దాదాపు తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు తక్కవనే చెప్పొచ్చు. ఈ ముగ్గురు పాస్ట్ బౌలర్లలో ఎవరికైనా గాయమైతే తప్ప ప్రసిద్ధ్ కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. భారత్ జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో, ఈనెల 12న నెదర్లాండ్స్ జట్టుతో ఆడనుంది. దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ విజయం సాధిస్తే.. నెదర్లాండ్స్ తో పోరులో ఫాస్ట్ బౌలర్లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ కు తుది జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంటుంది.