Rohit Sharma
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఫలితంగా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే అధికారికంగా సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. లంకతో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు.. వరుస విజయాలపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. జట్టు విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బ్యాడ్ కెప్టెన్ గా కనిపిస్తా. ఇప్పటికైతే జట్టు కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా అని రోహిత్ శర్మ తెలిపారు. జట్టు విజయాల్లో నాతోపాటు మిగతా పది మందికీ క్రెడిట్ ఇవ్వాలని అన్నారు.
జట్టుకోసం నిస్వార్థంగా బ్యాటింగ్ చేసే రోహిత్.. కాస్త స్వార్ధపూరితంగా కూడా బ్యాటింగ్ చేయాలని మాజీ క్రికెటర్లు సూచించినట్లు విలేకరులు రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోహిత్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.. ఆ తరువాత టీమ్ మేనేజర్ వైపు చూడటంతో హాల్ మొత్తం నవ్వులు విరిశాయి. ఆ తరువాత రోహిత్ మాట్లాడుతూ.. నేను ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేయలేను. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తా. నేను ఓపెనర్ గా క్రీజులోకి వెళ్తాను కాబట్టి నా లక్ష్యం ఒక్కటే ఉంటుంది.. పవర్ ప్లే ఓవర్లలో ఎక్కువ రన్స్ సాధించాలని. ఆమేరకు నా బ్యాటింగ్ ఉంటుందని రోహిత్ చెప్పాడు.
ప్రారంభంలోనే రెండుమూడు వికెట్లు పడిపోతే ఆ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో అలానే చేస్తా. ఆ సమయంలో మరో వికెట్ పడకుండా రన్స్ ను పెంచేలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు. మ్యాచ్ కు తగ్గట్లుగా మొదటి ఓవర్ లో ఎలా ఆడాలి..? ఐదో ఓవర్లో ఎలా ఆడాలి..? పదో ఓవర్లో ఎలా ఆడాలి?.. ఛేజింగ్ సమయంలో ఎన్ని పరుగులు చేయాలి..? అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని.. మ్యాచ్ లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆడటానికి నేను ప్రయత్నిస్తానని రోహిత్ సమాధానం ఇచ్చాడు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నా బ్యాటింగ్ తీరులో మార్పులు చేసుకుంటానని విలేకరుల ప్రశ్నకు రోహిత్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు.