Team India: ఆ కిక్కే వేరు.. అప్పట్లో ధావన్ ఇరగదీశాడు.. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ @10 ఇయర్స్

పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని టీమిండియా.. అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకుంది.

On This Day Team India won Champions Trophy in 2013

Team India – On This Day: ఎక్కడైనా, ఎప్పుడైనా విక్టరీ ఇచ్చే కిక్కే వేరు. కొన్ని విజయాలు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా బాగుంటాయి. మన దేశంలో అయితే క్రికెట్ విజయాలను అభిమానులు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటుంటారు. అలాంటిదే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) విజయం. పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (2013, జూన్ 24) ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా (Team India) కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలో భారత జట్టు రెండోసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అంతకుముందు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్సీలో 2002లో మొదటిసారి ఈ ట్రోఫీని భారత్ దక్కించుకుంది.

2013లో జూన్ 6 నుంచి 23 వరకు రౌండ్ రాబిన్ అండ్ నాకౌట్ ఫార్మాట్ లో జరిగిన టోర్నమెంట్ లో ఆద్యంతం సమిష్టిగా రాణించి టీమిండియా టైటిల్ అందుకుంది. ధోని నాయకత్వ ప్రతిభ, మిగతా టీమ్ సభ్యులు అంచనాలకు తగ్గట్టు సత్తా చాటడంతో టీమిండియా చాంపియన్ గా నిలిచింది. గ్రూప్ బీలో 6 పాయింట్లతో టాప్ లో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించింది ధోని సేన. గ్రూప్ ఏ నుంచి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫైనల్ కు వచ్చింది.

ఫైనల్ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించి భారత్ విజేతగా నిలిచింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(Rohit Sharma), శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఓపెనర్లుగా వచ్చారు.

ధోని డకౌట్.. కోహ్లి హిట్
విరాట్ కోహ్లి(43), రవీంద్ర జడేజా(33) ధావన్(31) రాణించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కెప్టెన్ ధోని 4 బంతులు ఆడి డకౌటయ్యాడు. 130 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లీషు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అశ్విన్(2), జడేజా(2), ఇషాంత్ శర్మ(2), ఉమేశ్ యాదవ్(1) పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. జడేజా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ధావన్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు.

Also Read: రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టిన చిన్న త‌లా.. స్వ‌యంగా వంట చేసిన రైనా

ధావన్ కు గోల్డ్ బ్యాట్ అవార్దు
ఓవరాల్ గా 363 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన శిఖర్ ధావన్.. గోల్డ్ బ్యాట్ అవార్డు దక్కింది. 12 వికెట్లు పడగొట్టిన జడేజా.. గోల్డ్ బాల్ అవార్దు అందుకున్నాడు. రోహిత్ శర్మ 177, కోహ్లి 176 పరుగులు సాధించారు. భువనేశ్వర్ కుమార్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ జట్టులోని మిగతా సభ్యులు. సమిష్టి ప్రదర్శనతో టీమిండియా విన్నర్ గా నిలిచింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి టీమిండియా గెలిచి పదేళ్లు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెమరీస్ ను గుర్తు చేసుకుంటున్నారు.

Also Read: దేశవాళీ రికార్డులు పనికిరావా..! సర్ఫరాజ్ ఏం చేయాలి..? బీసీసీఐని ప్రశ్నించిన భారత మాజీ ఓపెనర్