Opener Ruturaj Gaikwad breaks silence on getting no 4 role in ODIs
Ruturaj Gaikwad : రెండేళ్ల తరువాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. స్వతహాగా ఓపెనర్ అయిన అతడు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఔటైన అతడు బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. వన్డేల్లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 83 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు సాధించాడు.
వాస్తవానికి మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ ఉన్నప్పటికి కూడా జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచడం పట్ల రుతురాజ్ గైక్వాడ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తరువాత అతడు మాట్లాడుతూ.. 4వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగల ఓపెనర్ పట్ల ఆ రకమైన విశ్వాసాన్ని జట్టు మేనేజ్‌మెంట్ ఉంచడం ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను అని రుతురాజ్ అన్నాడు.
Virat Kohli : కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేస్తే.. ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిందో తెలుసా?
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం పట్ల స్పందిస్తూ.. తన బ్యాటింగ్ విధానంలో పెద్దగా మార్పులు చేసుకోలేదన్నాడు. తాను ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడు కూడా 40 నుంచి 45 ఓవర్లకు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
‘నాకు 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో ఎలా ఆడాలో తెలుసు. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేయడం, ఎప్పుడు బౌండరీలు కొట్టాలో అనే విషయాలు. కాబట్టి నాలుగో స్థానంలో ఆడడం పెద్ద కష్టం కాదు. తొలి 10 నుంచి 15 బంతులు ఎలా ఆడతాను అనే దానిపైనే దృష్టి పెడతాను. ఒక్కసారి కుదురుకుంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాను.’ అని రుతురాజ్ తెలిపాడు.
ఓపెనింగ్ నుంచి 4వ స్థానానికి మారిన సందర్భంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సందేశం గురించి గైక్వాడ్ వివరించాడు.
‘ఈ సిరీస్‌లో నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తానని నాకు ముందే చెప్పారు. కేవలం నా ఆటను మాత్రమే ఆస్వాదించమని సూచించారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల ఓపెనర్‌కు మేనేజ్‌మెంట్ నుండి ఆ రకమైన విశ్వాసం ఉండటం నాకు ఒక గౌరవంగా భావిస్తున్నాను. చివరి మ్యాచ్‌లో కూడా నేను బాగా రాణించగలనని ఆశిస్తున్నాను. ఆటను ఆస్వాదించమని, నా సహజ ఆటను ఆడమని కోచ్ నాకు చెప్పాడు.’ అని రుతురాజ్ వెల్లడించాడు.