Oval Test Day 5 weather report is that rain threat london
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలుపుకు ఆఖరి రోజు 35 పరుగులు అవసరం కాగా భారత్ విజయం సాధించాలంటే నాలుగు వికెట్లు తీయాలి.
వాస్తవానికి ఈ మ్యాచ్ నాలుగో రోజే ముగుస్తుందని అంతా భావించారు. ఇంగ్లాండ్ గెలుస్తుంది అన్న తరుణంలో భారత్ వికెట్లు తీసి మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ సమయంలో వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను కాస్త ముందుగానే ముగించారు. దీంతో అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఐదో రోజు పై పడింది. ఐదో రోజు వర్షం ముప్పు ఉందా? లేదా? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా టీమ్ఇండియా అభిమానులు మాత్రం ఐదో రోజు వర్షం పడకూడదని కోరుకుంటున్నారు. వర్షం పడి ఆఖరి రోజు మ్యాచ్ రద్దు అయితే.. మ్యాచ్ డ్రా ముగుస్తుంది. అప్పుడు సిరీస్ ఇంగ్లాండ్ సొంతం అవుతుంది. అలా కాకుండా మ్యాచ్ జరిగి భారత్ నాలుగు వికెట్లు తీస్తే అప్పుడు సిరీస్ సమం అవుతుంది.
ఓవల్‌లో సోమవారం (ఐదో రోజు) వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్యూ వెదర్ తెలిపింది. అయితే.. మధ్యాహ్నం వరకు వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వర్షం పడే ఛాన్స్ ఉందంది. అంటే ఈ లెక్కన తొలి సెషన్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. మొదటి సెషన్‌లోనే మ్యాచ్ పూర్తి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.