ENG vs IND : రీఎంట్రీలో ఇరగదీస్తారనుకుంటే.. టీమ్ఇండియా పాలిట విలన్లుగా మారారు.. ఆ ఇద్దరికి చివరి మ్యాచ్ ఇదేనా?
ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు.

Karun nair and Shardul thakur fail in England series
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేయాలని అనుకుంటోంది. దీంతో సిరీస్ ఫలితం ఎలా ఉండబోతుందా అని సగటు క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు. వీరిద్దరికి కూడా ఓవల్‌లో ఆడుతున్న మ్యాచే చివరి టెస్టు కానున్నట్లు కనిపిస్తోంది. మరోసారి వీరిద్దరిని భారత టెస్టు జెర్సీలో చూసే అవకాశం లేకపోవచ్చు. వారు ఎవరో కాదు.. ఎనిమిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఒకరు కాగా.. మరొకరు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.
ENG vs IND : గిల్ చెప్పిన ఆ ఒక్క మాట.. ఓవల్‌లో మ్యాచ్ గమనాన్నే మార్చేసిందా?
కరుణ్ నాయర్..
ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్. రీఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడతాడు అని అనుకుంటే అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 4 మ్యాచ్‌లు ఆడాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్థశతకం ఉంది. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి కుర్రాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం పోటీపడుతుండడంతో మరోసారి కరుణ్ నాయర్‌కు టీమ్ఇండియా తరుపున ఆడే ఛాన్స్ రావడం కష్టమే.
శార్దూల్ ఠాకూర్..
ఫామ్‌లో లేకున్నా కూడా 33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ అనూహ్యంగా ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. అతడికి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌ల్లో అతడు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్‌లో 46 పరుగులు చేయగా, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్ వంటి ఆటగాళ్లు రేసులో ఉండడంతో శార్దూల్ ఠాకూర్‌ను మరోసారి భారత జెర్సీలో చూడడం సందేహమే.