Pakistan : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాక్ బౌలింగ్ కోచ్‌ మోర్కెల్ రాజీనామా

Pakistan Bowling Coach Resign : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొమ్మిది మ్యాచులు ఆడిన పాక్ కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది.

Pakistan Bowling Coach Resign

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొమ్మిది మ్యాచులు ఆడిన పాక్ కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయి లీగ్ ద‌శ‌లోనే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. దీంతో పాకిస్థాన్ జ‌ట్టు పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్సీకి బాబ‌ర్ ఆజాం రాజీనామా చేయాల‌ని ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

మెగా టోర్నీలో పాకిస్థాన్ బౌల‌ర్లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో మోర్కెల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మోర్కెల్ చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఈ ఏడాది డిసెంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ఉంది. అయితే.. ముందుగానే అత‌డు త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు. జూన్ నెల‌లోనే ఆరు నెల‌ల కాలానికి గాను ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మిడిల్ ఓవ‌ర్ల‌లో వికెట్లు తీయ‌డంలో విఫ‌లం..

మిడిల్ ఓవ‌ర్ల‌లో వికెట్లు తీయ‌డంలో విఫ‌లం కావ‌డం కూడా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌కు గ‌ల కార‌ణాల్లో ఒక‌టి. స్పిన్న‌ర్లు చెల‌రేగే భార‌త పిచ్‌ల‌పై షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్ విఫ‌లం అయ్యారు. ఈ ఇద్ద‌రూ చెరో రెండు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టారు. స్పిన్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా విప‌లం కావ‌డం పాక్ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. అటు పేస‌ర్ల‌లో ష‌హీన్ అఫ్రీది మాత్ర‌మే రాణించాడు.

ODI World Cup 2023 : టీమ్ఇండియా రికార్డు.. 31 ఏళ్ల త‌రువాత‌.. ఆ ఇద్ద‌రూ కూడా బౌలింగ్ వేసి ఉంటేనా..?

తొమ్మిది మ్యాచులు ఆడిన అఫ్రిదీ 18 వికెట్లు తీశాడు. మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ హారిస్ రవూఫ్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. తొమ్మిది మ్యాచుల్లో ఏకంగా 500 ప‌రుగుల కంటే ఎక్కువ ఇచ్చాడు. దీంతో ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచి చెత్త రికార్డును న‌మోదు చేశాడు. .

త్వ‌ర‌లో భ‌ర్తీ చేస్తాం..

మోర్కెల్ బౌలింగ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు పీసీబీ అధికారికంగా ప్ర‌క‌టించింది. అత‌డి స్థానాన్ని త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపింది. పాకిస్థాన్ జ‌ట్టు డిసెంబ‌ర్ 14 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ నాటికి బౌలింగ్ కోచ్‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

Team of the tournament : రోహిత్‌కు షాక్‌.. కెప్టెన్‌గా కోహ్లీ.. క్రికెట్ ఆస్ట్రేలియా ‘టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్’..