ODI World Cup 2023 : టీమ్ఇండియా రికార్డు.. 31 ఏళ్ల తరువాత.. ఆ ఇద్దరూ కూడా బౌలింగ్ వేసి ఉంటేనా..?
ODI World Cup : నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన భారత జట్టు సభ్యులు అందరూ బౌలింగ్ చేయడం విశేషం.

Team India
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన భారత జట్టు సభ్యులు అందరూ బౌలింగ్ చేయడం విశేషం.
ఈ క్రమంలో ఓ రికార్డు భారత జట్టు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం 31 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి. మొత్తంగా మూడో సారి మాత్రమే.
భారత్, పాకిస్థాన్ లు సంయుక్తంగా నిర్వహించిన 1987 వన్డే పప్రపంచకప్‌లో తొలిసారి ఇలా జరిగింది. ఫెషావర్ లో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.
Gareth Morgan : ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెటర్ గారెత్ మోర్గాన్ అద్భుతం
గ్రాహం గూచ్ (84), మైక్ గ్యాటింగ్ (58), అలన్ లాంబ్ (76) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో శ్రీలంక లక్ష్యాన్ని 45 ఓవర్లలో 267 పరుగులకు సవరించారు. కాగా.. శ్రీలంక 45 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా తొమ్మిది మంది బౌలింగ్ వేశారు.
రెండో సారి..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు సంయుక్తంగా నిర్వహించిన 1992 వన్డే ప్రపంచకప్‌లో రెండో సారి ఇలాంటిది జరిగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 166 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రమీజ్ రాజా (119*) అజేయ శతకంతో రాణించడంతో పాకిస్థాన్ 44.4వ ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు తొమ్మిది మంది బౌలింగ్ చేశారు.
మూడోసారి..
తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. దీంతో 31 ఏళ్ల తరువాత మరోసారి ఇది చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లు బౌలింగ్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) లు శతకాలతో చేలరేగారు. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) లు హాఫ్ సెంచరీలు బాదారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.