Champions Trophy 2017 Final
మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతుంది. ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఉత్సాహంగా బరిలోకి దిగబోతుంది. ఎనిమిదేళ్ల తరువాత జరగబోతున్న ఈ టోర్నీని టీమ్ఇండియా ఎలాగైనా గెలవాలని, అదే సమయంలో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 2017 నాటి ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో 2017 ఫైనల్ నాటి మ్యాచ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగగా.. సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (114; 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో అజర్ అలీ (59; 71 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), మహ్మద్ హఫీజ్ (57 నాటౌట్; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ ఆజాం (46), ఇమామ్ వసీం (25 నాటౌట్) రాణించారు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12) విఫలం అయ్యాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేదారా్ జదవ్‌లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మూడు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ సైతం (5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు బాది కుదురుకున్నట్లుగానే కనిపించిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (21) సైతం ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్లు సైతం మహ్మద్ అమీర్ పడగొట్టాడు. ఈ దశలో జట్టును కాపాడే బాధ్యతను ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (22) భుజాన వేసుకున్నాడు. అయితే.. అతడితో పాటు ధోని (4), కేదార్ జాదవ్ (9) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 72 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దంచికొట్టిన పాండ్యా..
అయితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (76; 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), రవీంద్ర జడేజా (15)తోడుగా పాక్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. చూస్తుండగానే స్కోరు 150 పరుగులు దాటింది. పాండ్య శతకం దిశగా వెలుతున్నాడు. పాండ్యా ఏదైన అద్భుతం చేస్తాడేమోనని భారత అభిమానులు భావించారు. అయితే.. అనూహ్యంగా పాండ్యా రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 152 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. పాండ్యా-జడేజా జోడి ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పాండ్యా ఔట్ అయిన తరువాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. 30.3 ఓవర్లలో 158 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో పాక్ 180 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుండంతో నాటి ఫైనల్ చేదు జ్ఞాపకాలను భారత అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 23న జరిగే మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా.. భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ధోని సారథ్యంలో భారత్ ఈ కప్‌ను ముద్దాడింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఇదే..
– ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్ తో
– ఫిబ్రవరి 23 పాకిస్తాన్ తో
– మార్చి 2న న్యూజిలాండ్ తో