Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు, అత్యధిక రన్స్ చేసిన జట్టు ఏదో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..

Highest run getters in history of Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సమయం దగ్గర పడింది. మరో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23 న జరగనుంది.
ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించారు. ఇది తొమ్మిదో ఎడిషన్. భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో రెండు సార్లు ఈ టోర్నీ విజేతలుగా నిలిచాయి. కాగా.. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టు ఏదీ, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు ఎవరో ఓ సారి చూద్దాం.
అత్యధిక స్కోర్..
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ ఉంది. 2004లో ఓవల్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. కివీస్ బ్యాటర్లలో నాథన్ ఆస్టిల్ (145 నాటౌట్) భారీ శతకంతో చెలరేగాడు. స్కాట్ స్ట్రైరిస్ (75), క్రెగ్ మెక్‌మిలన్ (27 బంతుల్లో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో అమెరికా 42.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 210 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
BCCI : వార్నీ ఇదా అసలు సంగతి.. బీసీసీఐ కొత్త నిబంధనలు వెనుక.. ఆసీస్ పర్యటనలో అంత జరిగిందా?
ఆ తరువాత న్యూజిలాండ్ రికార్డుకు పాకిస్తాన్ చేరువగా వచ్చింది. 2017లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. కివీస్ రికార్డుకు కేవలం 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా అత్యధిక స్కోరు 331 పరుగులు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు..
చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ ఉన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 52.73 సగటుతో 791 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 133 పరుగులు. ఆ తరువాత మహేలా జయవర్థనే రెండో స్థానంలో ఉన్నాడు. జయవర్థనే 22 మ్యాచ్‌ల్లో 41.22 సగటుతో 742 పరుగులు చేశాడు. ఆ తరువాత శిఖర్ దావన్, సంగక్కర లు ఉన్నారు.
* క్రిస్ గేల్ – 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు
* మహేలా జయవర్థనే – 22 మ్యాచ్‌ల్లో 742 పరుగులు
* శిఖర్ ధావన్ – 10 మ్యాచ్‌ల్లో 701 పరుగులు
* కుమార సంగక్కర – 22 మ్యాచ్‌ల్లో 683 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు