BCCI : వార్నీ ఇదా అసలు సంగతి.. బీసీసీఐ కొత్త నిబంధనలు వెనుక.. ఆసీస్ పర్యటనలో అంత జరిగిందా?
బీసీసీఐ కొత్త నిబంధనలు రూపొందించడం వెనుక చాలా పెద్ద కథే జరిగిందా. ఓ సీనియర్ ఆటగాడి వల్లే ఇదంతానా

India Star Carried 27 Bags On Australia Tour BCCI had to Pay for those
టీమ్ఇండియా ఆటగాళ్ల విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కఠినమైన నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో సిరీస్ నుంచే ఈ నిబంధనలను అమలు చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగానూ నిబంధనల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్రికెటర్లు తమ భార్యలను, కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంపైనా ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీని కారణంగానే బీసీసీఐ ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఓ టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ చేసిన పని వల్ల బీసీసీఐకి లక్షల్లో ఖర్చైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు తీసుకువెళ్లే లేగేజీపై పరిమితులు విధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఆటగాడు 150 కిలోల లగేజీ తీసుకువెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. అంతకు మించితే ఆటగాడే స్వయంగా లగేజీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆసీస్ పర్యటనలో ఏం జరిగిందంటే?
దైనిక్ జాగరణ్‌లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఓ స్టార్ ఆటగాడు పరిమితికి మించి 27 బ్యాగ్‌లను తీసుకువెళ్లాడట. ఇవి ఆ ఆటగాడివి ఒక్కడివే కాదు. అతడి కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బందివి. ఈ బ్యాగుల మొత్తం బరువు 250kgs దాటిందని, ఇందుకు అయ్యే చార్జీలను బీసీసీఐ చెల్లించాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది. అతడి లగేజీలో 17 బ్యాట్లు ఉన్నాయి. వాటితో పాటు ఆటగాడి, అతడి కుటుంబం, వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్ల కుటుంబాలు, వ్యక్తిగత సిబ్బంది వారి స్వంత సామాను విడివిడిగా నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఈ క్రికెటర్ వ్యవస్థను నిర్వహించగలిగాడు. అతని, అతని కుటుంబ సభ్యుల సామాను రవాణాకు సంబంధించిన అన్ని ఖర్చులను బోర్డు భరించేలా చూసుకున్నాడు.
ఇక సిరీస్ మొత్తం వారు ఒక వేదిక నుంచి మరో వేదికకు ప్రయాణించారు. ఇందుకు అయ్యే ఛార్జీలను సైతం బీసీసీఐ చెల్లిండంతో లక్షల్లో ఖర్చైందనట్లు నివేదిక వెల్లడించింది. ఈ తతంగం మొత్తం మిగిలిన ఇతర సభ్యులపై తీవ్ర ప్రభావం చూపించింది. వారు కూడా అతడి బాటలోనే నడిచారని నివేదిక పేర్కొంది. దీంతో బీసీసీఐకి భారీ మొత్తంలో ఖర్చైనట్లుగా తెలుస్తోంది. అయితే.. సదరు ఆటగాడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
BCCI కఠిన చర్యలు..
ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ పర్యటనలకు ఆటగాడికి గరిష్టంగా 150 కిలోల లగేజీని మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ పరిమితిని మించి ఉంటే.. సదరు ఆటగాడే చెల్లించాల్సి ఉంటుంది. ఇక జట్టు ప్రయాణంపై బోర్డు తన వైఖరిని కఠినతరం చేసింది. ఆటగాళ్లు ఇప్పుడు మ్యాచ్‌ల కోసం టీమ్ బస్సులోనే ప్రయాణించాలి. వ్యక్తిగతంగా వెళ్లేందుకు వీలులేదు. నెల రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్న విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులను నిషేదించారు.
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఓ సీనియర్ ఆటగాడు తన వెంట భార్యను తీసుకువచ్చేందుకు అనుమతి కోరగా నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని సదరు ఆటగాడికి బోర్డు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.