Pant to Led India in Guwahati Test After Gill Left report
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం (నవంబర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs SA) బ్యాటింగ్ సమయంలో గిల్ మెడపట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత దృష్ట్యా.. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ మ్యాచ్‌లో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు.
రెండో టెస్టు కోసం జట్టుతో పాటే గౌహతి వచ్చిన గిల్ ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గొనలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం అతడిని జట్టు నుంచి రిలీవ్ చేశారు. దీంతో అతడు శుక్రవారం ఉదయమే ముంబైకి వెళ్లిపోయాడు. ముంబైలో రెండు నుంచి మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటాడని, ఆ తరువాత మరోసారి వైద్యులు కలవనున్నట్లు సమాచారం. కాగా.. గిల్ ను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపే విషయమై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా తెలుస్తోంది.
గిల్ రెండో టెస్టుకు దూరం కావడంతో రిషబ్ పంత్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఇక గిల్ స్థానంలో సాయి సుదర్శన్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి తుది జట్టులో స్థానం దక్కవచ్చు.
IND vs SA : యశస్వి జైస్వాల్.. నీ అహాన్ని కాస్త పక్కన పెట్టు.. లేదంటే..
వన్డే సిరీస్‌లో ఆడతాడా?
నవంబర్ 30 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ సిరీస్‌లో గిల్ ఆడతాడా? లేదా? అన్నదానిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.